ఏపీలో ఒకే రోజు ఇద్దరు కేంద్ర మహిళా మంత్రులు పర్యటిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ నేడు ఏపీలో పర్యటించనున్నారు. స్మృతి ఇరానీ విశాఖలో పర్యటిస్తుండగా.. భారతి ప్రవీణ్ పవార్ విజయవాడలో పర్యటించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఘన స్వాగతం పలికారు. ఇరువురు మంత్రులు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Read Also: Sapna Choudhary: ఒక్క స్టేజ్ షో కోసం రూ.25 లక్షలు.. సప్నా చౌదరి పూర్తి నికర విలువ తెలిస్తే షాక్
గత కొద్ది కాలంగా పురందేశ్వరి ఆధ్వర్యంలో ఏపీ బీజేపీలో నకిలీ మద్యం విక్రయాలపై ఆందోళన చేస్తుంది. పలు మద్యం దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం మాఫియా చెలరేగిపోతోందని, నకిలీ మద్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని కమలనాథులు ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ మద్యాన్ని వెంటనే అరికట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీబీఐ విచారణ కోరతామని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పురందేశ్వరి చెప్పారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరాని విశాఖ పర్యటనకు రావడంతో రాష్ట్రంలో నకిలీ మద్యం గురించి కేంద్రానికి వివరించారని అందుకే ఈ టూర్ జరుగుతోందని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ విచారణను తప్పనిసరిగా కోరుతామని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చెప్పారు.