NTV Telugu Site icon

Amit Shah: ఏపీ ప్రభుత్వంపై అమిత్‌షా తీవ్ర విమర్శలు

Amitshah

Amitshah

Amit Shah: మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృధ్ధిపై విశాఖ రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో 12లక్షల కోట్లు అవినీతి జరిగిందన్నారు. మోడీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదన్నారు. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో చిక్కుకుపోయిందని విమర్శలు గుప్పించారు అమిత్‌షా. దేశ అంతరంగిక భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. మన దేశ సరిహద్దులు తాకే ప్రయత్నాన్ని కూడా శత్రు దేశాలు చేయకుండా కట్టడి చేయగలిగామన్నారు. ప్రపంచ దేశాలు మోడీ జపం చేస్తున్నాయని.. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి కాదని ఆంధ్రప్రదేశ్‌తో పాటు 131 కోట్ల మందికి దక్కుతున్న గౌరవమన్నారు.

రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది… అది చూసి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుని ప్రజలను మభ్య పెడుతున్నారన్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్‌షా. పేదలకు కేంద్రం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యంపై ముఖ్యమంత్రి తన బొమ్మ వేసుకుంటున్నారన్నారు. విశాఖలో భూ మాఫియా,అక్రమ మైనింగ్, ఫార్మా కంపెనీలలో తప్పులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల30వేల కోట్లు ఏపీకి వస్తే ఆ డబ్బు అంతా ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో నిధులు అవినీతికి గురయ్యాయని ఆరోపించారు.

Read Also: Kunamneni Sambasiva Rao: బండి సంజయ్ నీ స్థాయి ఎంత? బీజేపీ లేకపోతే హిందూ మతానికి రక్షణ లేదా?

450కోట్ల రూపాయలతో వైజాగ్ రైల్వే స్టేషన్ అభివృద్ధి., కడప, కర్నూల్ ఎయిర్ పోర్టులు ప్రారంభించింది మోడీ ప్రభుత్వంలోనే అని ఆయన తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు లభించాయని.. విశాఖ, అనంతపురంలో మల్టీ పర్పస్ లాజిస్టిక్ పార్క్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకినాడ దగ్గర బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి ఇచ్చామన్నారు. 300సీట్లతో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ నుంచి 20పార్లమెంట్ సీట్లు గెలిపించడం ద్వారా బీజేపీ విజయానికి సహకరించమని అమిత్‌షా అభ్యర్థించారు.