బిక్షగాళ్ల సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించిందేకు కేంద్రం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. యాచకులు లేని దేశంగా ఇండియాను మార్చాలని కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్, నగర కూడళ్లు, మతపరమైన ప్రార్థనా మందిరాలు, చారిత్రిక ప్రదేశాల్లో బెగ్గర్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతుంటారు. కొందరు ఎలాంటి ఆధారం లేని దివ్యాంగులు, అనాథ పిల్లలు, వృద్ధులు యాచిస్తుంటారు. ఇంకొందరు ఆయా కారణాల చేత ఈ యాచక వృత్తిలోకి వస్తుంటారు. మరికొందరైతే ఈ వృత్తిని అడ్డంపెట్టుకుని ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద మాఫీయాలు కూడా తయారయ్యాయి. కొంత మంది పిల్లల్ని, మహిళలను అడ్డంపెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని బిక్షగాళ్ల రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
దేశం వ్యాప్తంగా బిక్షాటన ఎక్కువగా ఉన్న నగరాలపై కేంద్రం సర్వే చేయించింది. ఇందులో భాగంగా 30 నగరాలను కేంద్రం ఎంపిక చేసింది. ఉత్తారిదిలో అయోధ్య.. తూర్పున గువహటి, పశ్చిమాన త్రయంబకేశ్వరం, దక్షిణాన తిరువనంతపురం వరకూ ఇలా 30 నగరాల్లో పిల్లలు, మహిళలు యాచిస్తున్నారు. వీరిందరికి ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించనున్నట్లు ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. 2026 నాటికి బెగర్స్ లేని దేశంగా మార్చాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం జిల్లా మున్సిపల్ అధికారుల సాయంతో ఈ ప్రణాళిక అమలు చేసేందుకు కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ కంకణం కట్టుకుంది.
ఏం పథకం అంటే..
దేశ వ్యాప్తంగా గుర్తించిన బిక్షగాళ్లకు స్వయం ఉపాధి పథకం అమలు చేయనుంది. వారందరికి జీవనోపాధి కల్పించనుంది. ‘భిక్షా-వృత్తి ముక్త్ భారత్’లో భాగంగా రియల్‌టైమ్ అప్‌డేషన్ అయ్యేలా ఫిబ్రవరి నాటికల్లా జాతీయ పోర్టల్, మొబైల్ యాప్‌ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే సర్వే, పునరావాసం కోసం ఎంపిక చేసిన నగరాల్లో కూడా అధికారులు మొబైల్ యాప్‌లో షెల్టర్లు, నైపుణ్యాలు, విద్య, పునరావాసాలు తదితర పురోగతి నివేదికను అధికారులు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ఆ ప్రాంతాలు ఇవే..
బిక్షగాళ్లకు పునరావాసం కల్పించనున్న 10 మతపరమైన ప్రదేశాల్లో అయోధ్య, కాంగ్రా, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, సోమనాథ్ పావగఢ్, త్రయంబకేశ్వర్, బోధగయ, గౌహతి, మధురై ప్రాంతాలు ఉన్నారు.
టూరిస్ట్ ప్రాంతాలు ఇవే..
ఇక పర్యాటక ప్రదేశాల్లో విజయవాడ, కెవాడియా, శ్రీనగర్, నంసాయి, కుషినగర్, సాంచి, జైసల్మేర్, తిరువనంతపురం, పుదుచ్చేరి, అమృత్‌సర్, ఉదయ్‌పూర్, వరంగల్, కటక్, ఇండోర్, కోజికోడ్, మైసూరు, పంచకుల, సిమ్లా, తేజ్‌పూర్ వంటివి చారిత్రక నగరాల జాబితాలో ఉన్నాయి. ఈ బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించడంలో నగర పాలక సంస్థ తో పాటు సంబంధిత మతపరమైన ట్రస్ట్ లేదా పుణ్యక్షేత్రం బోర్డులు పాలుపంచుకుంటాయి.