Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. ఏపీకి రెవెన్యూ లోటు నిధులు విడుదల చేసింది.. రూ. 10,461 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోట్ పంపింది కేంద్ర ప్రభుత్వం.. విభజన అంశాల్లో భాగంగా రెవెన్యూ లోటు నిధుల విడుదల చేయనున్నట్టు రెండు వారాల క్రితం కేంద్రం ప్రకటించింది కేంద్రం.. 2014-15 నాటి రెవెన్యూ లోటు భర్తీకి ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద రూ.10,460.87 కోట్లను ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 19న కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం తొలిసారిగా ఇన్ని నిధులను ఏకమొత్తంలో విడుదల చేసింది. ఎన్నికల ఏడాదిలో ఈ మొత్తాన్ని విడుదల చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
Read Also: Rajasthan: పెళ్లి కావాల్సిన యువతి కిడ్నాప్.. అలా చేసి పెళ్లైపోయిందన్న నిందితుడు..
కాగా, రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూలోటు భర్తీ కోసం అప్పట్లో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కొంత మొత్తాన్ని విడుదల చేసిన కేంద్రం మిగిలిన సొమ్ము విడుదలలో జాప్యం చేస్తూ వచ్చింది.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే మధ్య కాలంలో 2014-15 కాలానికి రిసోర్సెస్ గ్యాప్‌కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో పరిహారం చెల్లించాలి. దీంతో, 2014-15 కాలానికి రాష్ట్రంలో రెవెన్యూలోటును రూ.16,078 కోట్లుగా తేల్చారు. అయితే, 2014లో తొలి విడతగా కేంద్రం రూ.2303 కోట్లు విడుదల చేయగా.. 2015లో మరో రూ. 500 కోట్లు, 2016లో రూ.1176.50 కోట్లు ఇలా మొత్తంగా రూ.3979.50 కోట్లు ఇచ్చింది. మిగతా మొత్తాన్ని 2016లో విడుదల చేస్తామని చెప్పిన కేంద్రం, ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే ఇవ్వాలని ఆ తరువాత పేర్కొంది.. అయితే, కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును రూ. 16,078 కోట్లుగా పరిగణించాలన్నారు. 2014-15 నాటికి బిల్లులు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కానీ, అప్పట్లో కేంద్రం ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రం ప్రభుత్వం పలు దఫాలుగా వినతిపత్రాలు సమర్పిస్తూ వచ్చింది.. మొత్తంగా ఇప్పుడు రూ.10,461 కోట్లను విడుదల చేసింది కేంద్రం. ఓవైపు నిధులు సరిపోక అల్లాడుతున్న ఏపీ ప్రభుత్వానికి.. ఇది కేంద్రం చెప్పిన గుడ్‌న్యూస్‌గా చూడాలి.