Central Election Commission in AP: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్ పర్యటన కొనసాగనుంది.. సోమవారం రాత్రే విజయవాడ చేరుకుంది కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం.. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.. ఇక, మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్‌ఎస్‌ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం సమీక్షిస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా ప్రకటించామని వెల్లడించారు.
Read Also: Gujarat: నేడు గుజరాత్ లో యూఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ రోడ్ షో..
ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది.. ఏపీ సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశంకానున్నారు. 10వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పర్యటన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బృందం వివరించనుంది.. దీంతో.. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని బృందం పర్యటన ముగియనుంది.. కాగా, ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. లోక్‌సభ ఎన్నికలకు కూడా జరగనున్న విషయం విదితమే.. అయితే, ఓటర్ లిస్టులో అవకతవకలపై ఇరు పార్టీలకు చెందిన నేతలు పలుమార్లు పోటాపోటీగా ఫిర్యాదు చేయడంతో.. కేంద్ర ఎన్నికల కమిషన్.. రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.