Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల రెండు రోజుల పర్యటన ముగిసింది.. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించిన సీఈసీ ప్రతినిధులు.. శనివారం సాయంత్రం తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు.. అయితే, ఈ పర్యటనలో.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఈసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు..
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్ర, శనివారాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులు.. ఈ భేటీలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర తదితరులు పాల్గొన్నారు. ఇక, రెండు రోజుల సీఈసీ ప్రతినిధుల పర్యటనలో కీలకాంశాల ప్రస్తావనకు వచ్చాయి.. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఈసీ దిశా నిర్దేశం చేసింది. ఓట్ల జాబితాలో మార్పు చేర్పులపై వచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా పరిగణించాలని కలెక్టర్లకు సీఈసీ దిశా నిర్దేశం చేసింది.. ఓటర్ల జాబితాపై పార్టీల ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించాలని సీఈసీ స్పష్టం చేసింది.
ఓటర్ల జాబితాపై పార్టీల ఫిర్యాదుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి.. ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ఉండొద్దని కలెక్టర్లు, ఎస్పీలకు సీఈసీ వార్నింగ్ ఇచ్చింది. జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా స్వచ్చికరణ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, ఇంటింటి సర్వే, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, శిక్షణ తదితరాలపై శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వగా, శనివారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు. టైమ్ బౌండ్ పెట్టుకుని ఎన్నికల ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది సీఈసీ. ఇక, సీఎస్, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఈసీ బృందం ప్రత్యేక భేటీ అయ్యారు.. అందుబాటులో ఎంత మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారనే అంశంపై సీఈసీ టీమ్ సమీక్ష నిర్వహించింది. ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇప్పించాలని సీఈసీ ప్రతినిధులు సూచించారు. శాంతి భద్రతల పరిస్థితిపై డీజీపీ నుంచి వివరాలు తీసుకున్నారు సీఈసీ ప్రతినిధులు. అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు సూచించింది. మద్యం, డబ్బుల అక్రమ రవాణను అరికట్టేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సీఈసీ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా క్యాంపెయిన్ చేపట్టాలని కలెక్టర్లకు సీఈసీ కీలక సూచనలు చేసింది.
ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా ప్రతి దశలో అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికతతో ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ ప్రతినిధులు స్పష్టం చేశారు.. ఎన్నికల అధికారులు, పౌరులు, అభ్యర్థులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని తెలిపారు. గత ఎన్నికల్లో నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించుకొని, దాని ఆధారంగా ప్రాంతాలనుబట్టి ప్రత్యేక సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.