NTV Telugu Site icon

Techie Suicide Case: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య.. సీఐ, అడ్వకేట్‌లపై కేసు నమోదు

Techie Suicide

Techie Suicide

Techie Suicide Case: ఏలూరు జిల్లా దెందులూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి చుక్కా తేజోమూర్తి కేసులో ఏలూరు వన్‌టౌన్ సీఐ రాజశేఖర్, అడ్వకేట్ సుబ్బారావులపై ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చుక్కా తేజోమూర్తిపై అతని భార్య ప్రియాంకా ఏలూరు వన్ టౌన్‌లో పిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ పేరుతో స్టేషన్‌కు పిలిపించి తేజోమూర్తిని సీఐ రాజశేఖర్, లాయర్ సుబ్బారావు వేధింపులకు గురి చేశారని అతని బంధువులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. 10 లక్షలు ఇచ్చి ప్రియాంకతో సెటిల్ చేసుకోవాలని సీఐ వేధింపులకు గురిచేయడంతో ఒత్తిడికి లోనైన తేజోమూర్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. బంధువుల స్టేట్‌మెంట్ ప్రకారం Cr no. 71/23 u/s 306 IPC సెక్షన్ల కింద తేజోమూర్తి భార్య ప్రియాంకతో పాటు ఆమె తల్లిదండ్రులు , సీఐరాజశేఖర్, అడ్వకేట్ సుబ్బారావు పేర్లను రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసును దెందులూరు సివిల్ పోలీసులకు బదిలీ చేశారు.

Also Read: Physical Harassment: పాక్లో 45 మంది మహిళా టీచర్లపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు

అసలేం జరిగిందంటే.. దెందులూరు గ్రామానికి చెందిన చుక్కా రాంప్రసాద్‌, రత్నమాల దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు తేజోమూర్తి బీటెక్‌ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో ఏలూరు నగరానికి చెందిన రవ్వ నాగ ప్రియాంకతో ప్రేమలో పడ్డారు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు కావడంతో వారి ప్రేమ విషయం పెద్దల దృష్టికి వెళ్లగా ముందు చదువు పూర్తి చేయాలని సూచించారు. తేజోమూర్తి తండ్రి రాంప్రసాద్‌ 2021లో ప్రాణాలు కోల్పోగా.. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి బీటెక్‌ పూర్తి చేసిన తేజోమూర్తి కొంతకాలం దెందులూరులో హోటల్‌ బిజినెస్ చేశాడు. అప్పులు తీరిన తర్వాత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న నాగప్రియాంకను వివాహం చేసుకోవడానికి సాప్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాడు. ఆమె కూడా సాప్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో ఇద్దరూ ఈ సంవత్సరం మే నెలలో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా సర్దుకుపోతున్నారు. ఇటీవల ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కావడానికి దెందులూరు వచ్చారు. వరలక్ష్మి వ్రతానికి నాగప్రియాంక ఆమె అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడా వివాదం జరిగింది. ఈ విషయమై ఆమె ఏలూరు ఒకటో పట్టణ పోలీసులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై తేజోమూర్తి బంధువులతో కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి విచారించారు.

Also Read: Viral Video: బస్సులో కునుకు తీస్తూ ఎలా పడిపోయాడో చూడండి..

ఆమె అతనితో ఉండటానికి ఇష్టపడటం లేదని, సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని సీఐ చెప్పడంతో నెల రోజుల సమయం ఇవ్వాలని వారు కోరారు. అందుకు సీఐ అంగీకరించలేదు. కేసు నమోదు చేయడం కూడా జరగదని, సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని సూచించారు. తన భార్యతో మాట్లాడే అవకాశం కల్పించాలని తేజోమూర్తి కోరినా అంగీకరించలేదు. ఈ క్రమంలో నాలుగైదుసార్లు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఆదివారం రాత్రి స్టేషన్‌కు వెళ్లగా.. అమ్మాయి తరఫు వారు రూ.10 లక్షలు డిమాండు చేస్తున్నారని, మీరు రూ.8 లక్షల వరకు అయినా చూసుకోవాలని సీఐ సూచించారు. నెల రోజులు సమయం ఇవ్వాలని కోరగా అంగీకరించలేదు. అంత డబ్బు ఇవ్వలేక.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా చేయడంతో తేజోమూర్తి మనస్తాపానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి స్కూటీపై దెందులూరు రైల్వేస్టేషన్‌ సమీపం వరకు వెళ్లి అక్కడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు సూసైడ్‌ నోట్ కూడా రాశాడు. అందులో ఎక్కడా సీఐ వేధించినట్లు లేదని పోలీసులు వెల్లడించారు. ఏలూరు రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.