సెప్టెబంర్‌లోకి ఎంటరయ్యాం. బడిగంట కొట్టారు.. పది రోజుల్లో వినాయక చవితి. అక్టోబర్‌లో దసరా..నవంబర్ లో దీపావళి, డిసెంబర్‌లో క్రిస్మస్.. న్యూ ఇయర్… సంక్రాంతి. ఇలా వరసగా పండగలే పండుగలు. అంటే వచ్చేదంత పండగల సీజన్ అన్నమాట. అంటే జనం పెద్ద ఎత్తున షాపింగ్. బంధు మిత్రుల సందడి. దుకాణాలు కిటకిట లాడతాయి. వచ్చి పోయే వారితో బస్సులు..వీధులు రద్దీగా మారతాయి. మంచిదే ..కానీ మనం కరోనా మధ్యలో ఉన్నామనే సంగతిని మర్చిపోతున్నాం. కరోనా పోయిందిలే అనుకుంటే వచ్చే ప్రమాదం ఏమిటో సెకండ్ వేవ్ పాఠం నేర్పింది. మూడు లక్షల ప్రాణాలను బెట్టి.. తగిన మూల్యం చెల్లించుకున్నాం. ఇప్పుడు మళ్లీ అదే జరగబోతోందా? అన్న అనుమానం కలుగుతోంది.
ఇప్పుడు మనం సెకండ్ వేవ్ చివరలో ఉన్నామంటున్నారు వైద్య నిపుణులు. ఐతే, ఇంకా భారీగానే కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజు నలబై వేల పైమాటే.ఐతే, వీటిలో అధిక శాతం ..అంటే దాదాపు 30 వేల కేసులు కేరళ నుంచే కావటం ఆందోళన కలిగిస్తోంది. ఇది థర్డ్ వేవ్‌కు ప్రారంభం అంటున్నారు కొందరు. అలాగే మహారాష్ట్ర, కర్నాటకలో కూడా కేసుల తీవ్రత ఉంది. ఐతే, ఈ రాష్ట్రాల్లో పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడటం ఆందోళన కలిగించే విషయం. ఇది థర్డ్ వేవ్ ప్రభావమా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
కేసులు పెరుగుతుండటంతో కేంద్రం కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలను మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఇక రాబోయేది పండుగల సీజన్ కావడంతో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతూ కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. రాబోయే రెండు నెలల్లో వినాయక చవితి, నవరాత్రి, దసరా, దీపావళి పండగలు వస్తున్నాయ్. డిసెంబర్ క్రిస్‌మస్, న్యూ ఇయర్‌తో కరోనా ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. భారీగా జనం గుమిగూడకుండా చూడాలని, రద్దీ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. కొన్ని జిల్లాల్లో భారీగా యాక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల్లో కొవిడ్ కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.
కోవిడ్ జాగ్రత్తలు పాటించటంలో నగర ప్రాంత పబ్లిక్ పర్వాలేదనిపిస్తున్నారు. కాని చిన్న చిన్న టౌన్లు , గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నిండా నిర్లక్ష్యం. కనీసం మాస్కులు కూడా పెట్టుకోని పరిస్థితి కనిపిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, గాలి బాగా ఆడే ప్రదేశాల్లో ఉండటం, మూసి ఉన్న ప్రదేశాల్లో గుంపులుగా చేరకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలా చోట్ల ఇవేవీ కనిపించదు. ముఖ్యం పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్.. వైన్స ల పర్మిట్ రూంలలో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. అక్టోబర్, నవంబర్ దాకా వివిధ పండుగలు ఉన్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగలు పరిమితంగా ఇళ్లలోనే చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కరోనావైరస్‌కు వేగంగా రూపాంతరం చెందే గుణముంది. కేసులు పెరిగే కొద్దీ మ్యుటేషన్లు పెరుగుతాయి. కాబట్టి దానిని అడ్డుకోవటం ఒక్కటే ఇప్పుడు మనముందున్న మార్గం. ఈ దశలలో పండుగలు పబ్బాలంటూ ఒక్కచోట చేరితే మాత్రం సెకండ్ వేవ్ రిపీట్ కావటం ఖాయం. అందుకు తాజా ఉదాహర కేరళ. బక్రీద్, ఓనం ఉత్సవాలు ఆ రాష్ట్రంలో కేసుల పెరుగుదలకు కారణమయ్యాయి. మొదటి దశ కరోనా విజయవంతంగా కట్టడిచేసింది కేరళ. మరి సెకండ్ వేవ్‌లో ఎందుకు విఫలమైంది? దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏదేమైనా, దేశంలో కరోనా తగ్గిందనుకున్న సమయంలో ఇక్కడ ఇలా జరగటం ఆందోళన కలిగిస్తోంది.
రోజురోజుకు కేసులు పెరగటం దేనికి సంకేతం? మనం మరో ముప్పు ముంగిట ఉన్నామా? కేరళలో కేసుల పరిస్థితి మూడవ వేవ్ సంకేతమా? అంటే అవుననే అంటోంది కేంద్ర నిపుణుల బృందం. గతంలోనే ఈ విషయం స్పష్టం చేశారు. కేరళ,మహారాష్ట్ర, కర్నాటకలో నమోదవుతునన కేసులు కరోనా థర్డ్ వేవ్ భయాలను మరింత పెంచుతున్నాయి. కేరళ కరోనా కల్లోలంతో పండుగలపై అన్ని రాష్ట్రాలను కేంద్రం అలెర్ట్ చేసింది.
పండగలు ..పెళ్లిళ్లతో ..ఇతర పెద్ద వేడుకలతో పాటు మత కార్యక్రమాలు సూపర్ స్ప్రెడర్స్ కు వేదికవుతాయి. భారీగా కరోనా కేసులు నమోదు కావటానికి అవే కారణం. పండుగలు, పెళ్లిళ్ల లో అంతా ఒకేచోట గుమిగూడటం కూడా పరిస్థితి అదుపు తప్పటానికి ఓ కారణం. ఈ సందర్భాలతో తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే వినాయకచవితి పండగపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఇది హిందువుల ప్రధాన పండగల్లో ఒకటి. తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. నిత్యం భక్త కోటి మంటపాలకు వచ్చి పూజాకార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని గంటలపాటు అక్కడే గడుపుతారి. అలాగే నిమజ్జనం రోజుల భారీ ఊరేగింపులు ఉంటాయి. వేలాది మంది భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి ఈ సారి వినాయక చవితికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేస్తుందో తెలియదు. గత ఏడాది మాత్రం వినాయక చవితికి పెద్దగా సందడి కనిపించలేదు. భారీ వినాయకులను కూర్చోపెట్టలేదు. ఈ సారి అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఆక్టోబర్ నాటికి థర్డ్ వేవ్ తీవ్రతపై ఒక స్పష్టత వస్తుంది. అయితే అదే నెలలో హిందువుల మరో ప్రధాన పండగ దసరా వుంది.దేశం నలుమూలల నుంచి ప్రజలు తమ స్వస్థలాలకు చేరుతారు. రైళ్లు బస్సులు కిక్కిరిస్తాయి. ఇది చాలు.. థర్డ్ వేవ్ డెడ్లీగా మారటానికి . అలాగే దసరా పండగకు ముందు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలలో కూడా ప్రజలు భారీగా పాల్గొంటారు. దుర్గ ఆలయాలు భక్తులతో కిక్కిరుస్తాయి. ఇక విజయ దశమి నాడు కలిసి తినడం, తాగడం చేస్తారు.. గుంపులు గుంపులగా జమీ వృక్షం వద్దకు చేరుతారు. అలయ్ బలయ్ తీసుకుంటారు. మరి వీటన్నిటికి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారన్నది ముఖ్యం. దీని మీదనే థర్డ్ వేవ్ విజృంభన ఆధారపడి వుంటుంది.
దసరా తరువాత సరిగ్గా ఇరవై రోజులకు దీపావళి రానే వస్తుంది . ఇది కూడా దాదాపు దసరాలాగే. డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్.. ఇది క్రైస్తవులకు అది అతి పెద్ద పర్వదినం. మరో ఆరు రోజులకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్…ఇలా అన్నీ దేనికవే భారీ వేడుకలు. జనం కరోనా నిబంధనలు పాటించేలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి వుంటుంది. అలాంటి సమయంలో సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ధరించడం వంటి విషయాల్లో స్ట్రిక్ట్‌గా ఉండాలి. అతిక్రమించిన వారిపై ఫైన్లు వేయటానికి కూడా ప్రభుత్వం వెనకాడకూడదు.
పోయిన సంవత్సరం ఇదే సమయంలో మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించడం వల్ల మహమ్మారిని విజయవంతంగా అడ్డుకున్నాం. తక్కువ నష్టంతో బయటపడ్డాం. తర్వాత మన నిర్లక్ష్యమే కొంప ముంచింది. అది రెండో వేవ్‌కు దారితీసింది. ఇప్పుడు కూడా మనం సరిగ్గా అదే పొజిషన్‌లో ఉన్నాం. కరోనా మహమ్మారికి సంబంధించి ప్రస్తుతం సున్నితమైన, క్లిష్టదశలో ఉన్నామంటున్నారు వైద్యులు. దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ మొదలై ఉండొచ్చని అంటున్నారు వారు.
ఇప్పుడు దేశంలోని అన్నిచోట్లలో ఇంకా కరోనా రెండో వేవ్‌కు తెరపడలేదు. కేసులు దాదాపు పూర్తిగా తగ్గిన తరువాత కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్లీ కేసులు పెరిగితే థర్డ్ వేవ్ వచ్చిందని సిగ్నల్. కేరళ, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో పాటు ఇంకా కొన్ని చోట్ల ఇప్పటికీ సెకండ్ వేవ్ కేసులు వస్తూనే ఉన్నాయి. కేసులు పూర్తిగా తగ్గాయని భావించిన బెంగళూరు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, బెంగాల్, గుజరాత్ తదితర చోట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో మూడో వేవ్ మొదలైందని అనుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
అయితే దేశ వ్యాప్తంగా పరిస్థితిని ఇప్పుడు ఎలా అంచనా వేయలన్నదానికి నిర్థిష్టమైన ఆధారాలు లేవు. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉన్నందున అన్నింటినీ ఒక గాటన కట్టి.. మూడో వేవ్, వ్యాప్తి, ఇతర అంచనాలు వేయలేం. ఏ రాష్ట్రాల్లో కేసులు అదుపులో ఉన్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయనేదీ పరిశీలించాల్సి ఉంటుంది. ఏదేమైనా జనం ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది. లేదంటే ఏం జరిగినా దానికి వారే బాధ్యులు అని మరవద్దు!!