Site icon NTV Telugu

Gujarat Assembly Polls: గుజరాత్‌ ఎన్నికలు.. ముగిసిన రెండో దశ ప్రచారం

Gujarat Assembly Polls

Gujarat Assembly Polls

Gujarat Assembly Polls: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. డిసెంబర్‌ 5న సోమవారం రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ పార్టీలు తమ హేమాహేమీ నాయకులను ప్రచార బరిలోకి దింపాయి. డిసెంబర్ 5న పోలింగ్ జరగనున్న 93 నియోజకవర్గాల్లో 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ప్రధానంగా వదోదరా, అహ్మదాబాద్, గాంధీనగర్ తదితర నగరాలు కూడా ఉన్నాయి. ఈ 93 స్థానాల్లో మొత్తం 2.54 కోట్ల మంది ఓటర్లున్నారు. 26,409 బూత్‌లలో పోలింగ్ జరగనుంది, దాదాపు 36,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వినియోగించనున్నారు. ఎన్నికల సంఘం 14 జిల్లాల్లో 29,000 మంది ప్రిసైడింగ్ అధికారులను, 84,000 మంది పోలింగ్ అధికారులను మోహరించనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఈ దశలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. రెండో దశలో ఘట్లోడియా నుంచి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, విరామ్‌గామ్ నుంచి పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్, గాంధీనగర్ సౌత్ నుంచి ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకోర్ ప్రముఖ అభ్యర్థులు. హార్దిక్ పటేల్, ఠాకూర్ ఇద్దరూ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో డిసెంబర్ 1, 2 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి ప్రచారం జరిపారు. మోడీతో పాటు బీజేపీ తరఫున సీనియర్ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్.. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే.. ఆప్ తరఫున ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రచారం నిర్వహించారు.

WHO: కొవిడ్ విషయంలో డబ్ల్యూహెచ్‌వో గుడ్‌న్యూస్.. ఏమిటంటే?

గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం స్థానాల సంఖ్య 182 కాగా.. తొలి దశలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్‌లోని స్థానాల్లో ఆ రోజు ఎన్నికలు జరిగాయి. ఆ రోజు 63.31% పోలింగ్ నమోదైంది. చివరిదైన రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న జరుగుతుంది. రెండో దశలో అధికార బీజేపీకి కూడా కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థుల నుంచి సవాల్‌ ఎదురవుతోంది. వాఘోడియా నుండి బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భాజపా మాజీ ఎమ్మెల్యేలు దిను సోలంకి, ధవల్‌సిన్హ్ జాలా, హర్షద్ వాసవ కూడా పద్రా, బయాద్, నాందోద్ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు.

Exit mobile version