ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య కేసులో సంజయ్ రాయ్‌కు ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా కలకత్తా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లలో కోరాయి. శుక్రవారం పరిశీలించిన కోర్టు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించింది. ఈ కేసులో ఏకైక దోషి అయిన రాయ్ కు విధించిన శిక్షను సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను ధర్మాసనం స్వీకరించలేదు. దర్యాప్తును సీబీఐ నిర్వహించిందని అందువల్ల సీబీఐ అప్పీలు స్వీకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. మార్చి 17న ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగించనుంది.
READ MORE: AP Budget Session: 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
ఇదిలా ఉండగా.. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ రూమ్‌లో ఒక మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేశారు. మరుసటి రోజు కోల్‌కతా పోలీసులు సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. తరువాత కలకత్తా హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ అక్టోబర్ 7న ట్రయల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. నవంబర్ 4న రాయ్ పై అభియోగాలు మోపింది. ఈ కేసులో ఈ ఏడాది జనవరి 20న ట్రయల్ కోర్టు రాయ్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. రాయ్‌కి మరణ శిక్ష విధించాలని కోరుతూ… సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలకత్తా హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. సీబీఐ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది.
READ MORE: Delhi Elections: దుమారం రేపుతున్న అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం.. విచారణకు ఎల్జీ ఆదేశం