NTV Telugu Site icon

Bengaluru: భారత్‌లో అతిపెద్ద ఆఫీస్‌ను ఖాళీ చేసిన దిగ్గజ సంస్థ.. అందుకేనా?

Byjus

Byjus

Byjus Vacates its Largest Office Space in Bengaluru: కరోనా సమయంలో విద్యార్థులకు ఎంతగానో సేవలందించిన భారత్‌లో అత్యంత విలువైన ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్. మహమ్మారి విజృంభించిన సమయంలో డిమాండ్ అధికంగా ఉండగా.. ప్రస్తుతం ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో బైజూస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. రుణదాతలతో విభేధాల అనంతరం ముగ్గురు బోర్డు సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేశారు. మరోవైపు బిలియన్ డాలర్ల నిధులు సమకూరకపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను కూడా తొలగించింది. ఇదే క్రమంలో ఉద్యోగులకు పీఎఫ్ బకాయిలు చెల్లించట్లేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఒకానొక సమయంలో వెలుగు వెలిగిన సంస్థ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.

Also Read: Smartphones Under 25000: 25 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు.. టాప్ 5 జాబితా ఇదే!

తాజా పరిణామాల నేపథ్యంలో బైజూస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని తన అత్యంత పెద్ద ఆఫీస్ స్థలాన్ని ఖాళీ చేసింది. ఇది బెంగళూరులో ఉంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం సహా నిధులు సమకూర్చడం, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కోసమే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. మరొక ఆఫీసులోని కొంత స్థలాన్ని కూడా వదులుకున్నట్లు వార్తలొచ్చాయి. బెంగుళూరులో బైజూస్‌కు ఏకంగా 5.58 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద ఆఫీస్ ఉంది. ఇక ఇక్కడ నెలకు రూ. 3 కోట్ల చొప్పున అద్దె చెల్లిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఆ ఆఫీస్‌ను వదిలేసింది. ఉద్యోగుల్ని తమ సమీప ప్రాంతాల్లోని ఇతర బైజూస్ ఆఫీసులు లేదా ఇంటి దగ్గర నుంచి పనిచేయాలని కోరింది. బెంగళూరులోని ప్రెస్టైజ్ టెక్ పార్క్‌లో ఉన్న తన ఆఫీసులో కూడా మొత్తం 9 ఫ్లోర్లలో రెండు ఫ్లోర్లను ఖాళీ చేసింది.