SBI ATM: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం (మార్చి 2) తెల్లవారు జామున రావిర్యాల గ్రామంలో ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత వ్యూహాత్మకంగా దోపిడీ చేశారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టారు. ఆ తరవాత కేవలం నాలుగు నిమిషాల్లోనే ఏటీఎం నుంచి డబ్బును తీసుకొని పారిపోయారు. రెండు రోజుల క్రితం మాత్రమే ఏటీఎంలో రూ. 30 లక్షలు నిక్షిప్తం చేసినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు.
Read Also: Britain- Ukraine: ఉక్రెయిన్కి మద్దతుగా ఐరోపా దేశాలు.. బ్రిటన్ భారీ సాయం
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు జరిపారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దొంగలు షిఫ్ట్ కారులో వచ్చి, పూర్తి వ్యూహాత్మకంగా చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. 29 లక్షల రూపాయలు అపహరణకు గురైనట్లు బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు. పోలీసులు దొంగలను త్వరగా పట్టుకుని, దొంగతనం జరిగిన డబ్బును రికవరీ చేస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఏటీఎం సెక్యూరిటీ వ్యవస్థల్లో లోపాలను సరిదిద్దేలా బ్యాంక్ యాజమాన్యం, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.