తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఓ ఏడాది గడువు ఉన్నా.. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం సెగలు రేపుతోంది. అయితే.. ఇటీవల అధికార టీఆర్‌ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తనకు పార్టీలో అవమానం జరిగిందని, తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదంటూ అందుకే రాజీనామా చేసినట్లు బూర నర్సయ్య గౌడ్ వివరించారు. అయితే.. బూర నర్సయ్య బీజేపీలోకి వెళ్లనున్నట్లు ఇదివరకే వార్తలు వినిపించాయి. అందుకు అవునన్నట్లుగా ఆయన బీజేపీ జాతీయ నాయకులతో ఇటీవల భేటీ అయ్యారు.
అయితే ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తరుణ్ చుగ్‌ను బూర నర్సయ్య కలువనున్నారు. తరుణ్ చుగ్ నివాసంలో ఆయన భేటీ కానున్నారు. రేపు బీజేపీ కార్యాలయంలో జాతీయ నాయకత్వం సమక్షంలో అధికారికంగా చేరనున్న బూరా నర్సయ్యగౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆ తర్వాత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను కూడా మరోసారి కలువనున్నట్లు తెలుస్తోంది.