Site icon NTV Telugu

Faiz-e-Ilahi Mosque: అర్ధరాత్రి బుల్డోజర్ చర్య.. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

Delhi

Delhi

ఢిల్లీలో అర్ధరాత్రి బుల్డోజర్ చర్యలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో స్థానికులు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుర్క్‌మాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) బుధవారం ఉదయం బుల్డోజర్ ఆపరేషన్ నిర్వహించింది. ఆక్రమణను తొలగించడానికి ఆ స్థలంలో పదిహేడు బుల్డోజర్లను మోహరించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో మోహరించాయి. సంఘటనా స్థలంలో మోహరించిన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి జనసమూహాన్ని చెదరగొట్టారు. చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు.

Also Read:గిన్నెలు కడిగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? అయితే మీకు జబ్బులు రావడం ఖాయం.!

ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు, జనవరి 7వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీలోని రాంలీలా మైదాన్ సమీపంలోని తుర్క్‌మాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదు చుట్టూ ఉన్న ఆక్రమణ ప్రాంతంలో ఢిల్లీ ఎంసీడీ కూల్చివేత పనులు చేపట్టిందని సెంట్రల్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుర్ వర్మ తెలిపారు. కూల్చివేత సమయంలో, కొంతమంది దుండగులు రాళ్లు రువ్వారని తెలిపారు. మసీదుకు ఆనుకుని ఉన్న డిస్పెన్సరీ, వివాహ మందిరాన్ని అక్రమ నిర్మాణాలుగా ప్రకటించినట్లు MCD అధికారులు తెలిపారు. రాంలీలా మైదాన్ ప్రాంతంలో సర్వే నిర్వహించిన తర్వాత ఈ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణలను తొలగించడానికి నివాసితులకు అధికార యంత్రాంగం ఇప్పటికే సమయం ఇచ్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయని పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.

Exit mobile version