Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026కు ముందు ఆటోమొబైల్ పరిశ్రమ ప్రభుత్వం వద్ద కీలక డిమాండ్లను పెడుతుంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాగే దిగుమతి కార్లపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని సవరించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇలా చేస్తే డిమాండ్ పెరగడమే కాకుండా, ఈవీల వైపు భారత్ వేగంగా అడుగులు వేయగలదని ఆయా కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఎంట్రీ లెవల్ ఈవీలకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని, ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో కమర్షియల్ ఎలక్ట్రిక్ కార్లకు మద్దతు కల్పించాలని కోరారు. ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సంస్కరణలు, రెపో రేట్ తగ్గింపులు, పన్ను విధానాల్లో మార్పుల వల్ల ప్యాసింజర్ వాహన రంగంలో డిమాండ్ పునరుజ్జీవం అయిందని, కానీ ఎంట్రీ లెవల్ ఈవీల అమ్మకాలు మాత్రం ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయని తెలిపారు.
Read Also: Sangareddy: ఇస్నాపూర్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత
ఈవీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి..
అయితే, జీఎస్టీ సంస్కరణల కారణంగా పెట్రోల్ కార్ల ధరలు తగ్గడంతో, తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ వాహనాలపై పోటీ మరింత పెరిగిందని శైలేష్ చంద్ర చెప్పారు. “ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మేం అభినందిస్తున్నాం.. కానీ బడ్జెట్‌లో రెండు విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మొదటిది ఎంట్రీ లెవల్ ఈవీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం, రెండవది కమర్షియల్ ఈవీలకు మద్దతు ధర కల్పించడం” అని అన్నారు. కాగా, కమర్షియల్ రంగంలో ఉపయోగించే ఈవీలు మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో కేవలం 7 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, మొత్తం ప్రయాణ కిలోమీటర్లలో వాటి వాటా 33 నుంచి 35 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఇవి FAME-2 స్కీమ్‌లో భాగంగా ఉండేవని, కానీ ప్రస్తుతం అమలులో ఉన్న పీఎం ఈ-డ్రైవ్ పథకంలో ఇవి లేకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. అయితే, ఒక కమర్షియల్ వాహనం సాధారణ ప్యాసింజర్ కారుతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ప్రయాణిస్తుంది.. అందువల్ల ఈ రంగానికి మద్దతు ఇస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు చమురు దిగుమతుల తగ్గింపులో కూడా భారీ ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also: How to Remove Shoe Odour: షూ వాసన ఇబ్బంది పెడుతుందా..? ఉతకకుండానే ఇలా వదిలించుకోవచ్చు..
కస్టమ్స్ డ్యూటీని సవరించాలి..
ఇక, మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.. దిగుమతి లగ్జరీ కార్లపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేస్తే ప్రీమియం సెగ్మెంట్‌లో డిమాండ్ పెరిగి, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం USD 40,000 కంటే తక్కువ ధర గల దిగుమతి కార్లపై 70 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉండగా, USD 40,000 కంటే ఎక్కువ ధర గల కార్లపై 110 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారని గుర్తు చేశారు. ఈ రెండు స్లాబ్‌లను తొలగించి ఒకే స్లాబ్ కిందకు తీసుకురావాలని సూచించారు. గతేడాది జీఎస్టీ రేట్ల సవరణ చాలా సానుకూల నిర్ణయమని, అదే తరహాలో ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ విషయంలో కూడా సంస్కరణలు అవసరమని అన్నారు.
అలాగే, రూపాయి విలువ పడిపోవడాన్ని నియంత్రించేలా స్థిరమైన ఆర్థిక విధానాలు, మెరుగైన ఫిస్కల్ మేనేజ్‌మెంట్ అవసరమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డైరెక్టర్, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు ధరలు పెంచాల్సి వస్తోంది.. దాని కారణంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా చూస్తే, యూనియన్ బడ్జెట్ 2026లో ప్రభుత్వం ఎంట్రీ లెవల్ ఈవీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, కమర్షియల్ ఈవీలకు మద్దతు ధరతో పాటు దిగుమతి కార్లపై కస్టమ్స్ డ్యూటీ సవరణ వంటి నిర్ణయాలు తీసుకుంటే ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు వస్తుందని పరిశ్రమ ఆశిస్తోంది.
