Budget 2025: బడ్జెట్ 2025 అనేక కారణాల వల్ల చారిత్రాత్మకంగా మారనుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మంత్రి అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్న ఈ పరిస్థితిలో, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఉపశమనం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్ను రేట్లలో మార్పులు, ఆదాయపు పన్ను మినహాయింపుల్లో పెరుగుదల ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
ద్రవ్యోల్బణం, నెమ్మదిగా పెరుగుతున్న జీతాలతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను స్లాబ్‌లో మార్పులు రావొచ్చని భావిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను తీసుకురావొచ్చు. ముఖ్యంగా పన్ను తగ్గింపుల వల్ల వినియోగదారుల ఖర్చులు పెరిగే అవకాశముండటంతో, ఇది ఆర్థిక వ్యవస్థకు కొంత బలాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also:Gas Cylinder Price : బడ్జెట్ కు ముందే వినియోగదారులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన సిలిండర్ ధర
కేంద్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగే సూచనలు
డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ ప్రకారం.. ప్రైవేట్ వినియోగం క్రమంగా మెరుగుపడుతున్నా, పెట్టుబడి కార్యకలాపాలు తక్కువగానే ఉన్నాయన్నారు. అయితే, ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని, దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా ఉండొచ్చని చెప్పారు.
కాపెక్స్ 20శాతం పెరుగుతుందని అంచనా
ఎర్నెస్ట్ & యంగ్ (EY) నివేదిక ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మూలధన వ్యయం (Capex) కనీసం 20శాతం పెంచే అవకాశం ఉంది. EY ఇండియా చీఫ్ పాలసీ సలహాదారు డికె శ్రీవాస్తవ్ ప్రకారం, వృద్ధిని వేగవంతం చేయడం, ఆర్థిక నియంత్రణను సమతుల్యం చేయడం ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమవుతుందని తెలిపారు. అదే సమయంలో, కేంద్రం ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉండి స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచే విధానాన్ని అమలు చేయవచ్చని డీబీఎస్ సీనియర్ ఆర్థికవేత్త రాధిక రావు అభిప్రాయపడ్డారు.
Read Also:Union Budget 2025: నేడు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి..
మొత్తంగా…
ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతికి ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండే అవకాశముంది. ముఖ్యంగా, పన్ను తగ్గింపులు, పెట్టుబడుల పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత నిధులు కేటాయించే అంశాలు ప్రధానంగా ఉండవచ్చని అంచనా. శనివారం ప్రవేశపెట్టబోయే 2025-26 బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి.