Jana Sena MLA Buddha Prasad Warns TDP: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కొందరు టీడీపీ నాయకుల తీరుతో కూటమికి నష్టం జరుగుతోందని జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నీతివంతమైన పాలన కోసం చేస్తున్న ప్రయత్నాలకు కొందరు నాయకులు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. అవనిగడ్డలో నెలకొన్న పరిస్థితులకు నలుగురైదుగురు టీడీపీ నాయకులే కారణమని ఆరోపించారు. జనసేన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు అని వార్నింగ్ ఇచ్చారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని రామానగరంలో జరిగిన జనసేన పార్టీ నియోజకవర్గ విస్తృత సమావేశంలో బుద్ధ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘అవనిగడ్డలో కూటమిని టీడీపీ నాయకులు ఛిన్నాభిన్నం చేస్తున్నారు. టీడీపీ నాయకులు అరాచకాలు జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జి మంత్రికి తేలియదా?. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. నీతివంతమైన పాలనకు సీఎం, డిప్యూటీ సీఎం చేస్తున్న కృషికి టీడీపీ నాయకులు కొందరు తూట్లు పొడుస్తున్నారు. అవనిగడ్డకు టీడీపీ పరిశీలకునిగా వచ్చిన వ్యక్తి నారా లోకేష్ పేరు భ్రష్టు పట్టిస్తున్నాడు. పేకాట, రేషన్ బియ్యం వ్యాపారం పోషించలేదని నాపై టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. పరిశీలికులు చిల్లర పనులకు నారా లోకేష్ పేరు వాడుతున్నాడు. కూటమిలో ఈ పరిస్థితికి అతనే కారకుడు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఇంచార్జిలకు ఎంత ప్రాధాన్యత ఇస్తే.. ఇక్కడ టీడీపీ ఇంచార్జికి అంత ప్రాధాన్యత ఇస్తాం?. టీడీపీ నాయకులు ఇప్పటికైనా ఆలోచించాలి. జనసేన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు’ అని ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు.
‘టీడీపీ నాయకులు ఆలోచన చేసి ముందుకు నడవాలి. ఇది జనసైనికుల ఆత్మ గౌరవ సభ, ఎవరినీ కించపరిచే సభ కాదు. నియోజకవర్గంలో కొద్దిమంది టీడీపీ నాయకుల పరిస్థితి వేరుగా ఉంది. నలుగురైదుగురు టీడీపీ నాయకుల కారణంగా పరిస్థితి ఛిన్నాభినంగా మారింది. గతంలో నన్ను కొందరు విమర్శించినపుడు సహనం పాటించటంతోనే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చింది. నీతివంతమైన పాలన కావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతుంటే, ఇక్కడ కొందరు వారి ఆశయాలను మంటగలుపుతున్నారు. నేను శంకుస్థాపన చేసిన రోడ్డుకు మరో నేత వచ్చి శంకుస్థాపన చేసిన ఘటన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. ఇలా వ్యవహారిస్తున్న నాయకుల సంగతి ఇంచార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తిలకు తెలియనిదా? అని నా ప్రశ్న. చంద్రబాబును ఎవరైనా ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ ఊరుకోరు అని, పవన్ సూచన మేరకే తాను ఇన్నాళ్లు చూస్తూ ఊరుకున్నాము’ అని ఎమ్మెల్యే చెప్పారు.
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సీట్ల కోసం ఎవరినీ యాచించదు. పవన్ కళ్యాణ్ త్యాగాలు, సహకారం దృష్టిలో ఉంచుకొని సీట్లు కేటాయించాలి. పవన్ కళ్యాణ్ మనసు నొప్పించేలా వ్యవహరిస్తున్నారనే ఆవేదన జనసైనికులలో ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైరి వర్గాలను కలిపిన ఘనత పవన్ గారికే దక్కుతుంది. ఆ రెండు వర్గాలను శాశ్వత శత్రువులను చేస్తారో? శాశ్వత మిత్రులుగా ఉంచుతారో ఆలోచించుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకుంటే.. నారా లోకేష్ పేరుతో అధికారులను బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పరిపాలన వ్యవహారాల్లో దూరి, అధికారులపై బెదిరింపులకు పాల్పడుతూ వారిని ఇబ్బంది పెట్టేలా అతను చేసే వ్యవహారాలకు నియోజకవర్గ ర్యాంకు పడిపోయే పరిస్థితి వస్తుందని ఇప్పటికే నేను సీఎం దృష్టికి తీసుకెళ్లాను. భవిష్యత్ ఉన్న నాయకుడు, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉన్న నారా లోకేష్ పేరును భ్రష్టు పట్టించేలా అతని తీరు ఉంది’ అని ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ఫైర్ అయ్యారు.

