NTV Telugu Site icon

BY Vijayendra: కాంగ్రెస్ నేత కాళ్లను తాకిన యడియూరప్ప కుమారుడు.. వీడియో వైరల్

By Vijayendra

By Vijayendra

BY Vijayendra: కర్ణాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర శుక్రవారం తుమకూరులోని ఓ ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయేంద్ర తన తండ్రికి కంచుకోట అయిన షికారిపుర నుంచి పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడి కాళ్లు తాకుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షికారిపుర నుంచి నామినేషన్‌ దాఖలు చేసేందుకు మూడు రోజుల ముందు విజయేంద్ర యెడియూరులోని సిద్ధలింగేశ్వర ఆలయానికి వచ్చారు. ఇదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కర్ణాటకలో ప్రముఖ షెడ్యూల్డ్ కులాల నేత అయిన పరమేశ్వర విజయేంద్ర అక్కడ ఉండటంతో ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

ఎన్నో ఊహాగానాలు, డ్రామాల తర్వాత బీజేపీ షికారిపుర నుంచి విజయేంద్రను బరిలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేయగా, కేంద్ర నాయకత్వం అందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. యడ్యూరప్ప కూడా సిద్ధరామయ్యపై తన కుమారుడు పోటీ చేసే అవకాశాలను తోసిపుచ్చారు. 1983 నుంచి యడ్యూరప్ప ఏడుసార్లు విజయం సాధించడంతో షికారిపుర బీజేపీకి సేఫ్ సీటుగా భావిస్తున్నారు. అయితే టికెట్ ఆశించిన కొందరు స్థానిక నేతల నుంచి విజయేంద్రకు కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.

Read Also: Airport issue in Karnataka: విమానాశ్రయం మూసేస్తే వ్యాపారం ఎట్లా?. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొత్త చిక్కు

కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మరోసారి అధికారం నిలుపుకోవాలని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇక, కర్ణాకటలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న వెలువడనుంది. మే 10న పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు.

 

Show comments