NTV Telugu Site icon

KTR: ‘శ్వేతపత్రం’ తప్పుల తడక.. కాంగ్రెస్ ప్రభుత్వం మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది: కేటీఆర్‌

Ktr

Ktr

KTR Presentation On BRS Govt 9.6 Years Rule: ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ‘శ్వేతపత్రం’ తప్పుల తడక అని, అబద్ధాల పుట్ట అని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పధం వైపు నడిపించామని, విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లిన ఘనత తమ పార్టీది అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీ వేదికగా తాము దీటుగా సమాధానం చెప్పామని చెప్పుకొచ్చారు. తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ.. తెలంగాణ భవన్‌లో స్వేదపత్రం పేరిట కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంకు కౌంటర్‌గా బీఆర్‌ఎస్‌ స్వేదపత్రం విడుదల చేసింది.

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ… ‘అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. వాయిదా వేసుకొని పోయారు. బాధ్యతగల పార్టీగా స్వేదపత్రం విడుదల చేస్తున్నాం. కోట్ల మంది చెమటతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ఈ స్వేదపత్రం. కొత్తరాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పధం వైపు నడిపించాం. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లిన ఘనత మాది. 60 ఏళ్ల గోస 10 ఏళ్లలో మాయం చేసి చూపించాం. రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొంది. ఇప్పుడు సమృద్ధివైపు తెలంగాణ అడుగులు వేసింది’ అని అన్నారు.

‘కరువులు, కల్లోల్ల తెలంగాణ ఆనాడు. 2014 ముందు హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలు వెనకబడ్డాయి. నల్లగొండ జిల్లాల్లో 90 శాతం మంది ఫ్లోరోసిస్ బారిన పడ్డారు. ఎవరు లేరు తెలంగాణకు అని చెప్పిన నాయకులకు తొత్తులుగా మారిన ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఉద్యమంలో లేని నాయకులు ఈనాడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 2001 నుంచి ఉద్యమం చేసిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధన వైపు నడిపించారు. శ్వేత పత్రాలు అంటూ మళ్లీ జనాన్ని మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ఆర్ధిక చిక్కులు, రాజకీయ కుట్రలు, విభజన చట్టం అమలు కష్టాలు, ఉద్యోగులు, ఆస్తులు పంపిణీ, విద్యుత్ కోతలు, తాగు-సాగు నీటి కష్టాలు. వీటన్నింటినీ అధిగమించి రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్’ అని కేటీఆర్‌ చెప్పారు.

Also Read: Sabarimala Darshan 2023: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

‘పటిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ఆర్ధిక క్రమశిక్షణ సంస్కరణ దిశగా తెలంగాణ పయనించింది. 60 ఏళ్ల గత పాలన, ఆరునరేండ్ల పాలన బేరీజు వేసుకోండి. మేము పాలించింది ఆరునరెండ్లు మాత్రమే. ఎందుకంటే కరోనాతో రెండేళ్లు పోయింది. అన్ని సక్రమంగా చేసుకొని 2014 నుంచి ప్రగతి పథం వైపు తీసుకెళ్ళింది కేసీఆర్ ప్రభుత్వం. సివిల్ సప్లైలో 56 వేల కోట్లు అప్పు అనేది అబద్దం. ఈరోజు సివిల్ సప్లై వెబ్ సైట్ లో ఉన్నది 26 వేల కోట్లు. సివిల్ సప్లై దగ్గర 36 వేల కోట్ల ధాన్యం ఉంది. రిసీవనబుల్స్, స్టాక్స్ చూపకుండా కాంగ్రెస్ సర్కార్ తప్పుడు లెక్కలు చూపింది. 6 లక్షల 71 వేల కోట్లలో ఈ అప్పును కలిపారు’ కేటీఆర్‌ ఆరోపించారు.