NTV Telugu Site icon

KCR: తెలంగాణలో కాంగ్రెస్ పాలన అస్పష్టంగా కొనసాగుతోంది

Kcr

Kcr

KCR: బీఆర్‌ఎస్‌ సిల్వర్‌జూబ్లీ సభ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలిపారు. ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలతో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమైన కేసీఆర్‌.. ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సభ విజయవంతం కావడానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఎల్కతుర్తిలో సభా ప్రాంగణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అస్పష్టంగా కొనసాగుతోందని, మార్పు కోరుకున్న రైతులు తీవ్రంగా నిరాశకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ సిల్వర్‌జూబ్లీ సభ ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలని కేసీఆర్ సూచించారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేసి, అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి, శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

సిల్వర్‌జూబ్లీ సభ నిర్వహణ బాధ్యతలు అప్పగించినందుకు కేసీఆర్‌కు వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సభను విజయవంతంగా నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధిలో హైదరాబాద్‌కు పోటీపడేలా వరంగల్‌ను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని నేతలు కొనియాడారు.

Mumbai Indians: హార్థిక్ నుంచి అశ్వని కుమార్ వరకు.. టాలెంట్ ను గుర్తించడంలో ముంబై ఇండియన్స్ తోపు..