Site icon NTV Telugu

KCR: నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. పార్టీ నేతలతో కీలక సమావేశం

Kcr Speech

Kcr Speech

KCR: తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు తదితరులు హాజరుకానున్నారు. మొత్తం సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్‌ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తుండటంతో ఆయన ప్రసంగంపై పార్టీలో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్‌ పార్టీ సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి. సమావేశంలో పాల్గొనడానికి కేసీఆర్‌ శనివారం సాయంత్రమే ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్‌ నందినగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు.

READ MORE: Sons Kill Father: రూ. 3 కోట్ల బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకులు..

ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరుల స్తూపం, జయశంకర్‌ విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం కేసీఆర్‌ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ సాగునీటి హక్కుల కోసం మరో జల సాధన ఉద్యమం అవసరమని కేసీఆర్‌ భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్రం, రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ అభిప్రాయపడుతోంది.

Exit mobile version