Site icon NTV Telugu

Kadiyam Srihari: మణిపూర్‌లో గొడవలకు కారణం బీజేపీ ప్రభుత్వమే..

Kadiyam Srihari

Kadiyam Srihari

Kadiyam Srihari: మణిపూర్ అల్లర్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గ స్థాయి పాస్టర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు ముస్లింలు, క్రిస్టియన్‌లపై దాడులు జరుగుతున్నాయన్నారు. చర్చిలపై దాడులను కేంద్ర ప్రభుత్వం నివారించాలని, మతం అనేది విశ్వాసమని అందరూ గౌరవించాలన్నారు. బీజేపీ ప్రభుత్వంలోనే దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో చర్చిలపైన, క్రైస్తవుల పైన అనేక దాడులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో మతకల్లోలాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపణ చేశారు.

Also Read: Richest MLA’s in India: ఇండియాలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేలు వీళ్లే.. ఏపీ సీఎం జగన్, చంద్రబాబు ఏ ప్లేస్లో ఉన్నారంటే..!

ఏ దేశంలోనైనా మతం అనేది వారి విశ్వాసమని, ఆ విశ్వాసాన్ని ఎవరూ కాదనరాదన్నారు. మణిపూర్‌లో మైతీ, నాగాస్, కుకీ తెగల మధ్య గొడవలకు కారణం బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. మణిపూర్ హైకోర్టు తీర్పు సరైనది కాదని, ప్రభుత్వం చేయాల్సిన పనిలో హైకోర్టు జోక్యం చేసుకుందన్నారు. ఎక్కువ శాతం క్రైస్తవులపై దాడులు, చర్చిలను కూలగొట్టడం జరుగుతుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. మణిపూర్‌లో అల్లర్లకు కారకులైన వారిపై ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు చర్యలు తీసుకుంటామనడం చాలా దురదృష్టకరమన్నారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాలలో ఇలాంటి మతతత్వ గొడవలు సృష్టిస్తూ ప్రజల మధ్య మతాల మధ్య మనుషుల మధ్య రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోందని.. ఇది సరైన విధానం కాదని కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్ర సీఎం కేసీఆర్.. పండగలను, మతాలను, వర్గాలను అందరినీ సమానంగా చూస్తున్నారన్నారు. ఇక్కడి క్రైస్తవులకు అండదండగా ఉంటూ ఎప్పటికీ వారి పక్షాన నిలబడతానని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Exit mobile version