Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు

Brs

Brs

Telangana Assembly: అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్ఎస్ అగ్రనేతలపై చట్టపరమైన చర్యలు మరింత తీవ్రమయ్యాయి. ఖైరతాబాద్‌ పోలీస్ స్టేషన్‌తో పాటు, తాజాగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లోనూ బీఆర్ఎస్ నాయకులపై మరో కేసు నమోదైంది. అసెంబ్లీ గేట్‌ నంబర్‌ 3 వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అడ్డుకోవడమే కాకుండా తీవ్రంగా ప్రవర్తించారని మహిళా కానిస్టేబుల్‌ కె. పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న మహిళా పోలీసులను ఉద్దేశించి తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక, వారి విధులకు తీవ్ర విఘాతం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరసన సమయంలో కొందరు టీషర్టులు విప్పి మహిళా సిబ్బంది ఎదుట అర్ధనగ్నంగా నిలబడి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఈ ఊహించని ఘటనతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళా పోలీసులకు ఆస్పత్రిలో చికిత్స అందించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి కేటీఆర్, హరీశ్‌రావు, నవీన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి సహా మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352 సెక్షన్లతో పాటు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాల కోసం సీసీటీవీ ఫుటేజ్, మీడియా వీడియోలు, ఫొటోలు, బాధితుల వైద్య రికార్డులను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు.