Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్

Balka Suman

Balka Suman

Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. శనివారం అర్ధరాత్రి సుమన్‌ను నాంపల్లి పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలిచారు. నిన్న మధ్యాహ్నం పోలీసులు తెలంగాణ భవన్‌లో సుమన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సింగరేణి కార్యాలయాలు, రైలు పట్టాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సింగరేణి అధికారులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాంపల్లి పోలీసులు తెలిపారు. బాల్క సుమన్‌పై సెక్షన్స్ 326(g), 351(3), 353(1)(b), r/w 55, r/w 61(2)(a) BNS, 4 PDPPA యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో వాదనలు విన్న అనంతరం బాల్క సుమన్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నాంపల్లి మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంది.

ఇక తన అరెస్ట్ అంశంపై ఇప్పటికే బాల్క సుమన్ స్పందించారు. తాను మాట్లాడుతున్నాను. ప్రశ్నిస్తున్నాను కాబట్టి తన గొంతు నొక్కాలే, అరెస్టు చేసి జైల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. “నిర్భందం విధించి తద్వారా పైశాచిక ఆనందం పొందాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతుంది. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే పని మీద దృష్టి పెట్టండి. ఇళ్ల పట్టాలు ఇవ్వండి. మూడేళ్లలో ఎవ్వరికీ ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. సింగరేణిలో రూ.15 వేల కోట్ల కుంభకోణం చేశారు. రూ.1600 కోట్ల విలువైన బొగ్గును మాయం చేశారు. సింగరేణిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావట్లేదు. కొత్త మైన్స్​ లేవు. మా కార్మికులు గానీ, వారి కుటంబాలు గానీ ఆవేదన, ఆందోళన బాధతో ఉన్నారు. ఆ ప్రాంత ప్రతినిధిగా ఆ ప్రజల తరఫున మేం మాట్లాడుతున్నాం” అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యా్ఖ్యానించారు.

×
×
Ad