NTV Telugu Site icon

KCR: లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌.. నేడు చేవెళ్ల నుంచి ప్రచారానికి కేసీఆర్‌ శ్రీకారం

Cm Kcr Brs Sabha

Cm Kcr Brs Sabha

KCR: లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతోంది బీఆర్‌ఎస్‌.. అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌.. నేడు చేవెళ్ల నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పార్లమెంట్‌ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో స్పీడ్‌ పెంచుతోంది కారు.. నేడు చేవెళ్లలోని ఫరా కళాశాల మైదానంలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు గులాబీ అధినేత కేసీఆర్‌ హాజరు కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జరగనున్న బహిరంగసభలో కాంగ్రెస్ పాలన తీరును ఎండగట్టేలా కేసీఆర్‌ ప్రసంగం సాగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు చేవెళ్ల ఎంపీ సీటును కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌.. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. తద్వారా ప్రత్యర్థులకు దీటైన సమాధానం చెప్పాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న తొలిసభకు రెండు లక్షల మంది జనాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: Memantha Siddham Bus Yatra: 14వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి సీఎం జగన్‌ షెడ్యూల్‌ ఇదే..

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫరా ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో జరగనున్న బహిరంగసభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కాలె యాదయ్య, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌లతో కలిసి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పదేళ్ల పాలన, కాంగ్రెస్‌ పార్టీ మూడు నెలల పాలన బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సబిత. చేవెళ్ల లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. మరోవైపు.. ఈనెల 16న సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు. సుల్తాన్‌పూర్ శివారులోని సింగూర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభకు హాజరవుతారు బీఆర్ఎస్‌ అధినేత. మరోవైపు.. ఇప్పటికే పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశాలు.. విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. కార్యకర్తల్లో జోష్‌ నింపేందుకు ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్‌రావు ప్రయత్నాలు సాగిస్తోన్న విషయం విదితమే.