KCR : బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా, ఆయన హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంగా, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నందినగర్‌కు చేరుకొని “కేసీఆర్ జిందాబాద్” అంటూ నినాదాలు చేయడంతో పాటు ఆయన కారుపై పూలు చల్లి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం, అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై ఎజెండా ఖరారు చేసేందుకు బీఏసీ (BAC) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై స్పష్టత రానుంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పలు అంశాలపై తీవ్ర చర్చ జరగనుందని అంచనా.
బడ్జెట్ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగనున్న అవకాశముంది. మార్చి 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చించనున్నారు. అలాగే, 17, 18 తేదీల్లో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ , ఎస్సీ వర్గీకరణ తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉందని సమాచారం.