నేడు సీనియర్ రాజకీయ నేత, మాజీ రాష్ట్ర మంత్రి, కాపు ఉద్యమ నేతైన ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. నేటి ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షాన పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈయన గత కొద్దీ రోజులుగా ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఆంధ్ర రాజకీయాలలో తీవ్రంగా నడిచింది.
also Read: Election Code: ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల కోడ్..
కాకపోతే.., సీఎం జగన్ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని నిర్ధారించుకున్న ఆయన చివరకు వైసీపీ వైపే మొగ్గు చూపారు. ఇక ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం చూస్తే.. 1978లో జనతా పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక అందులో ముద్రగడ చేరారు. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఈయన గెలుపొందారు. 1999 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్ సభ స్థానంలో గెలిచారు. అంతేకాదు వేరు వేరు ప్రభుత్వాల్లో మంత్రిగానూ ఆయన పని చేశారు.