ఆసియా కప్ 2025 ని భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రికార్డ్ విజయంను అందుకుంది. టీమిండియా తదుపరి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ఆదివారం దుబాయ్ స్టేడియంలో జరగనుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజెన్స్, పలువురు ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ‘బాయ్‌కాట్ ఆసియా కప్’ ట్రెండ్ అవుతోంది.
గత కొన్నేళ్లుగా భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు బాగాలేవు. పహల్గాం దాడి, ఆపై ఆపరేషన్ సిందూర్ ఘటనల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. పహల్గాం దాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరగనున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలని తాజాగా సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది. అయితే ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. అదొక ఆట మాత్రమే, అని, దానిని అలా ఉండనివ్వండి అంటూ వ్యాఖ్యానించింది. ఇక మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ట్విట్టర్‌లో ‘బాయ్‌కాట్ ఆసియా కప్’ ట్రెండ్ అవుతోంది.
Also Read: Abhishek Sharma: తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు!
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను తప్పక బహిష్కరించాలని ప్రముఖ నటుడు సతీష్ షా అభిమానులను కోరారు. ‘ప్రతి దేశభక్తుడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. మ్యాచ్ సమయంలో మీ టీవీని ఆఫ్ చేయండి. భారత జట్టు పట్ల ఉన్న గౌరవం పోయింది’ అని సతీష్ షా పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కి ఓ నెటిజెన్ రియాక్ట్ అయ్యాడు. ‘మీరు జట్టు పట్ల గౌరవాన్ని ఎందుకు కోల్పోరు. మీరు ఒకటి తెలుసుకోవాలి. మ్యాచ్ నిర్ణయించింది జట్టు కాదు, బీసీసీఐ’ అని రాసుకొచ్చాడు. ‘భారత ఆర్మీ పట్ల గౌరవం ఉంటే ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడొద్దు. లేదా టోర్నీనే బాయ్‌కాట్ చేయండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
