Boyapati Srinu: నా ఊరంటే నాకు ఇష్టం.. మన ఓటే మన ఆయుధం!

Boyapati Srinu Votes In Ap

Boyapati Srinu Votes In Ap

Boyapati Srinu Votes in AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఓటు వేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోయపాటి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెదకాకానిలోని జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.

ఓటు హక్కు వినియోగించుకుంటున్న అనంతరం బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. తనకు సొంతూరంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఊరికి ఉపయోగపడాలనే బాధ్యతతోనే ఓటు వేయడానికి వచ్చానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మన ఓటే మన ఆయుధమని బోయపాటి వ్యాఖ్యానించారు. సొంతూరిలో ఓటు వేసిన అనంతరం బోయపాటి అక్కడి ప్రజలతో మాట్లాడారు. తన బంధువులు, స్నేహితులను ఆప్యాయంగా పలుకరించారు.

ఇక బోయపాటి శ్రీను సినీ ప్రస్థానం విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. 2005లో విడుదలైన ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘తులసి’, ‘సింహా’, ‘దమ్ము’, ‘లెజెండ్’, ‘సరైనోడు’, ‘జయ జానకి నాయక’, ‘వినయ విధేయ రామ’, ‘అఖండ’, ‘స్కంద’ చిత్రాలతో మాస్‌ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అఖండ 2: తాండవం ప్రేక్షకులను నిరాశపర్చినా.. ‘అఖండ 3’ త్వరలోనే రూపొందించనున్నట్లు గతంలో వెల్లడించారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ సూర్య సహా ఓ మల్టీస్టారర్ పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.