NTV Telugu Site icon

AUS vs IND: రోహిత్ ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి అదొక్కటే మార్గం: రవిశాస్త్రి

Rohit Sharma Six

Rohit Sharma Six

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు దూరమైన హిట్‌మ్యాన్‌.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో దారుణ ప్రదర్శన చేశాడు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ సక్సెస్ అవ్వడంతో.. రోహిత్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుసగా 3, 6, 10 రన్స్ చేశాడు. దాంతో హిట్‌మ్యాన్‌ మళ్లీ ఓపెనర్‌గా ఆడాలని పలువురు మాజీలు సూచించారు. అయితే భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఆరో స్థానంలోనే రోహిత్ బ్యాటింగ్ చేయాలని అంటున్నాడు.

ఐసీసీ రివ్యూస్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై రవిశాస్త్రి స్పందించాడు. ‘రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా ఆడినా ఇబ్బంది లేదు. మూడో టెస్టులోనే ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని అడిగా. అయితే కేఎల్ రాహుల్‌ ఆటతో నా అభిప్రాయం మారింది. ఓపెనర్‌గా రాహుల్ ఆటను ఆస్వాదిస్తున్నాడు. అతడి టెక్నిక్‌ కూడా బాగుంది. ఏ బంతిని వదిలేయాలి, ఏ బంతిని ఆడాలనే విషయంపై పూర్తి అవగాహనతో ఉన్నాడు. కవర్‌ డ్రైవ్స్‌ను ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. రోహిత్ ఓపెనర్‌గా రావాలనుకోవడంలో తప్పేం లేదు. కానీ అతడు వ్యూహాలను కాస్త మార్చుకుంటే ఆరో స్థానంలో అత్యంత డేంజరస్‌ బ్యాటర్‌ అవుతాడు. గతంలోనూ రోహిత్‌కు ఆరో స్థానంలో ఆడిన అనుభవం ఉంది’ అని రవిశాస్త్రి చెప్పాడు.

Also Read: AUS vs IND: గబ్బాలో పోరాటం.. ఆకాశ్ దీప్‌ ఆసక్తికర విషయాలు!

‘మిడిలార్డర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు చేస్తే మైండ్‌సెట్‌ కూడా మారాలి. రెడ్‌బాల్ క్రికెట్‌ ఆడడం లేదని హిట్‌మ్యాన్‌ భావించాలి. టీ20, వన్డే క్రికెట్‌లో మాదిరిగా ఎటాకింగ్‌ చేయాలి. నా దృష్టిలో అతడు ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన మార్గం. సాధారణంగా తొలి 15 నిమిషాలు క్రీజ్‌లో కుదురుకోవడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు. కానీ రోహిత్ మాత్రం తొలి బంతి నుంచే బాదుడు మొదలెట్టాలి. ఆరో స్థానంలో వచ్చే బ్యాటర్లు ఎక్కువగా ఎటాకింగ్‌ ఆడతారు. ఒకవేళ వికెట్లు త్వరగా పడినప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతారు. హిట్‌మ్యాన్‌ మాత్రం దూకుడుగా ఆడితే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

Show comments