Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ

Botsa

Botsa

విజయనగరంలో సీనియర్ వైఎస్సార్‌సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని, దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రిని పదవి నుంచి పక్కన పెట్టాలని స్పష్టం చేశారు. యువత, నిరుద్యోగులు తమ సమస్యలపై గత డెబ్బై రోజులకు పైగా పోరాటం చేస్తున్నారని, వారు ర్యాలీలు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. వెనక్కి వెళ్తామన్నా ఒప్పుకోకుండా, కనీసం శాంతియుత ర్యాలీలకు కూడా అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని విమర్శించారు. వచ్చే ఆదాయంలో సగం డబ్బులు ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నాయని చెబుతున్న చంద్రబాబు, ఎన్నికల ముందు చెప్పిన సంపద సృష్టి ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. ఒకవైపు సంపద సృష్టిస్తామని చెప్పి, మరోవైపు రాష్ట్రాన్ని తీవ్ర అప్పుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ఏ రంగంలో అభివృద్ధి సాధించారో చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని సవాల్ విసిరారు.

వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, పేదలకు వరమైన ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పట్టించుకోకుండా కేవలం అమరావతి జపం మాత్రమే చేస్తున్నారన్నారు. మరోవైపు రైతులకు ఏ పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదని వాపోయారు. ఈ ప్రభుత్వం కేవలం వ్యక్తిగత స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆడపిల్లలు బయటకు రావాలంటేనే తీవ్ర భయాందోళనలకు గురయ్యే పరిస్థితి నెలకొందని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.