Bomb Blast: పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర శనివారం రాత్రి అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు అమ్మాయిలు స్వల్పంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం వినగానే ఆలయంలోని భక్తులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రదాడి జరిగి ఉంటుందని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఉగ్రదాడి కాదని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు.
Read Also: AP Students: మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు.. పంపించేందుకు ప్రభుత్వం సన్నాహాలు
గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో స్థానికులకు ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించడం వల్ల భయాందోళనకు గురయ్యారు. కొన్ని రాళ్లు, గాజు ముక్కలు వచ్చి తమపై పడ్డాయని కొందరు యాత్రికులు వచ్చారని చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా పార్కింగ్ ఏరియాలో ఉన్న పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే, స్వర్ణ దేవాలయంలో బాంబు పేలుడు అంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాబ్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ టీం పేలుడు జరిగిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ లభించిన కొంత పౌడర్‌ను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు.