Vande Bharat Express: వందే భారత్ రైళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల ప్రయాణ కాలం తగ్గుతుంది. అయితే ఈ రైలులో ఫీచర్లను ఎప్పటికప్పుడు ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా అప్ గ్రేడ్ చేస్తోంది రైల్వేశాఖ. ఇక కొత్తగా రూపొందిస్తున్న వందేభారత్ రైళ్లలో సాంకేతికతను ఉపయోగించి ప్రమాదాలను తగ్గించాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. దీని కోసం విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ సదుపాయాన్ని వందేభారత్ రైలులో కూడా కల్పిస్తోంది. కొత్తగా రూపొందిస్తున్న వందే భారత్‌లో సీసీఆర్వీసీ అనే రైలులో విమానంలోని బ్లాక్‌బాక్స్ తరహా సాంకేతికత ఉండనుంది. ఈ వందేభారత్ కొత్త కోచ్ లను బెంగాల్ లోని చిత్తిరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. అనంతరం వాటిని చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సెప్టెంబర్ లో పరీక్షించనున్నారు.
ఈ బ్లాక్ బాక్స్ లోకో పైలట్ కదలికలను గమనిస్తుంది. ఆడియో, వీడియోలను రికార్డు చేస్తుంది. దీని వల్ల ఎప్పుడైన రైలు ఏదైనా ప్రమాదానికి గురైతే ఈ బ్లాక్‌బాక్స్‌లోని సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవచ్చు. అలాంటి వేరే రైళ్లలో జరగకుండా చూసుకోవడానికి వీలుంటుంది. ఇక కొత్తగా రూపొందిస్తున్న వందేభారత్ రైలులో అనేక కొత్త ఫీచర్ లు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న డిస్క్ బ్రేక్ సిస్టమ్. దీని కారణంగా ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ప్రయాణిస్తే ఆటోమేటిక్ గా అవి ఆగిపోతాయి. ఇక కొత్తగా రూపొందించే రైళ్లలో రెండు ఇంజన్లు ఉంటాయి. అందువల్ల ముందుకు, వెనక్కు ప్రయాణించగలుగుతుంది. రెండు ఇంజన్లను ఒక పైలెట్ మాత్రమే నియంత్రించేలా చేస్తున్నారు. ఇక మరో ఫిచర్ ఆధునిక సాంకేతికతతో కూడిన ఎయిర్ కండిషన్ డ్రైవర్ క్యాబిన్. అయితే, ఈ క్యాబిన్లో టాయిలెట్ సౌకర్యం లేదు. ఇక రీసెంట్ గానే తెల్ల రంగు ఉన్న కారణంగా ఎక్కువ మురికి కనిపిస్తుందనే కారణంతో వందేభారత్ రైళ్ల రంగును కాషాయ రంగులోకి మార్చిన సంగతి తెలిసిందే. ఇక పైన చెప్పిన ఫీచర్లన్నీ కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణీకులు మరింత సురక్షితంగా ఈ వందేభారత్ రైళ్లలో ప్రయాణించవచ్చు. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న ఇవి త్వరలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి.