అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రామమందిరం దగ్గర క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. ఇదిలా ఉండగా, లోక్ సభ ఎన్నికల ముందు కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం రామాలయం అందుబాటులోకి వచ్చింది. దేశ ప్రజలు రామ్ లల్లా దర్శనం చేసుకునేలా ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించబోతోంది. బీజేపీ శ్రీరామజన్మభూమి దర్శన ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయోధ్యకు చెందిన కమలం పార్టీ నాయకులకు పార్టీ హైకమాండ్ పనులు అప్పగించింది.
Read Also: Israel Hamas War : హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 1000 మసీదులు ధ్వంసం
ఇప్పటికి అయోధ్య ధామానికి వచ్చే భక్తులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని బీజేపీ జిల్లా యూనిట్‌ను హైకమాండ్ ఆదేశించింది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.. అంతకంటే ముందే శ్రీరామ జన్మభూమి దర్శన ప్రచారాన్ని బీజేపీ ప్రారంభిస్తుంది. ప్రచారంలో భాగంగా దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ప్రజలను రాంలాలా దర్శనం కోసం పంపించాలని బీజేపీ అధిష్టానం తెలిపింది. అలాగే, రామమందిర ఉద్యమంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల క్రియాశీలక పాత్ర గురించి ప్రజలకు తెలియజేయనున్నారు. అంతే కాకుండా ఆలయ నిర్మాణాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఎలా అడ్డుకుంటున్నాయనే విషయం కూడా చెప్పనున్నారు.
Read Also: Ayodhya Ram Mandir: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. ఆలయాన్ని సందర్శించిన పాక్ క్రికెటర్!
ఇక, బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సాల్, వినోద్ తావ్డే సహా పలువురు నేతలు ఈ ప్రచారాన్ని పర్యవేక్షిస్తారని ఓ నివేదిక పేర్కొంది. ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు వీరంతా అయోధ్య జిల్లా యూనిట్‌తో టచ్‌లో ఉండనున్నారు. స్థానిక నేతలకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు (జనవరి 24న) అయోధ్యకు రానున్నారు. ఇక్కడ రామమందిరంలో శ్రీరాముడిని పూజించనున్నారు. అనంతరం శ్రీరామజన్మభూమి దర్శన ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
