Etela Rajender on Budget: కులాలకు అతీతంగా పెద్దగట్టులోని లింగమంతుల స్వామిని కొలుస్తున్నారని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ తరపున మొక్కులు చెల్లించుకున్నామని ఆయన వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెద్దగట్టు జాతరను స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించి అధిక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తమ మొక్కులు ఫలించి బీజేపీ అధికారంలోకి వస్తే పెద్దగట్టును సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామన్నారు.
2.95 లక్షల బడ్జెట్ ప్రకటించినా ప్రజల్లో సంతృప్తి లేదని ఈటల వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన విమర్శించారు. ఉద్యోగులు రిటైర్ అయితే జీపీఎఫ్ ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ సర్కారు ఉందని ఆరోపించారు. సర్కారుని నమ్మి బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. జీతాలు సమయానికి రాక బ్యాంకు ఈఎంఐలు కట్టలేక ఉద్యోగులపై ఎగవేతదారులుగా ముద్రపడుతోందన్నారు. రైతులకు రుణాల మాఫీ లేదన్న ఆయన.. గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని అంకెల గారడీ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్ అంతా గంభీరాలు డాంబికాలేనని విమర్శలు గుప్పించారు.
Revanth Reddy: జీరో బడ్జెట్.. భూప్రపంచంలో ఇలాంటి బడ్జెట్ ఎవరూ ప్రవేశపెట్టలేదు..
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోతుందని అన్నారు. పరిపాలించే సత్తాలేని వారే ముందస్తుగా రాజీనామా చేస్తారని ఆయన పేర్కొ్న్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ప్రజలను బాధలు పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌కి దగ్గరగా.. ప్రజలకు దూరంగా ఉంటారని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో రాచరిక పరిపాలన సాగిస్తున్న కేసీఆర్.. ఇక్కడ పరిపాలించే సత్తా లేని మీరు దేశ పర్యటనలు చేసి ఏం సందేశం ఇస్తారని ఈటల రాజేందర్ వెల్లడించారు.