మరోసారి అధికారం చేపట్టాలన్న ధీమాతో ఉన్న బీజేపీ నేడు ‘సంకల్ప పత్రం’ పేరిట ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. ‘మోడీ గ్యారెంటీ-2047 కల్లా వికసిత భారత్’ పేరుతో.. బీజేపీ కేంద్ర కార్యాలయంలో నేటి (ఆదివారం) ఉదయం 8:30గంటలకి కమలం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రధాని మోడీ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. అవినీతిపై మోడీ ప్రారంభించిన పోరాటం ఆగదని.. విపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా అవినీతిని నిర్మూలించేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. మరిన్ని కఠినమైన చట్టాలు చేస్తుందని ఈ మేనిఫెస్టోలో ప్రకటించే ఛాన్స్ ఉంది. సమాజంలో అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి తీసుకోబోయే చర్యలను కూడా ఈ మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు.
Read Also: KCR : అయితే మోడీ.. తప్పితే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..?
ఇక, రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధతపై బీజేపీ ఎలాంటి ప్రకటన చేయబోతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. అభివృద్ధి, సామాజిక న్యాయం, సాంస్కృతిక, జాతీయవాద అంశాలను కూడా బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రధానంగా చేర్చినట్లు సమాచారం. రామ జన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించి కోట్లాది హిందువుల కలను నెరవేర్చిన మోడీ.. భారతీయుల అస్తిత్వాన్ని, మనోభావాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపరిచే అవకాశం ఉంది. హై స్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైలు కారిడార్ల లాంటి అనేక మౌలిక సదుపాయాలను కూడా మ్యానిఫెస్టోలో ప్రకటించే ఛాన్స్ ఉంది. 2019లో విడుదల చేసిన సంకల్ప్ పత్రంలో పేర్కొన్న హామీల్లో ఎన్ని అమలయ్యాయో బీజేపీ తెలియజేయనుంది. జాతీయ భద్రతకు కూడా బీజేపీ కీలక ప్రాధాన్యం ఇవ్వనుంది. దేశ సరిహద్దుల్లో చెలగాటమాడితే మోడీ మౌనంగా ఉండరని..ధీటుగా సమాధానమిస్తారనే హెచ్చరికను కూడా బీజేపీ తమ మ్యానిఫెస్టోలో ప్రకటించబోతున్నాట్లు సమాచారం.