Site icon NTV Telugu

BJP: బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

Bjp

Bjp

బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. సార్వత్రిక ఎన్నికల వేళ మేనిఫెస్టో తయారీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ అధిష్టానం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. యువత, మహిళలు లక్ష్యంగా మేనిఫెస్టో తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోను అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం (14-04-2024)న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఇప్పటికే తన మేనిఫెస్టోను ప్రకటించింది.. ఇప్పుడు బీజేపీ తమ సంకల్ప పత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. కమలదళం తమ మేనిఫెస్టోను ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నాయి. మోడీ గ్యారెంటీ, వికసిత భారత్‌ థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Jeevan Reddy: రాష్ట్రప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!

మేనిఫెస్టో రూపకల్పనకు రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని మొత్తం 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఇప్పటికే రెండు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. సంకల్ప పత్రం కోసం దాదాపు 15 లక్షల సూచనలు రాగా.. ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రజలు నమో యాప్‌ ద్వారా పార్టీతో పంచుకున్నారు. వాటన్నంటిని పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Hardik Pandya: తనకు హార్దిక్‌ పాండ్యాపై అనుమానం ఉందంటున్న మాజీ ఆటగాడు..!

ఇక కాంగ్రెస్‌ పార్టీ న్యాయ పత్రం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. 5 న్యాయాలు, 25 గ్యారంటీలను అందులో ప్రకటించింది. మహిళా న్యాయ్‌ కింద పేద ఇంటి ఆడవారికి ఏటా రూ.లక్ష సాయం, కిసాన్‌ న్యాయ్‌ కింద రైతులకు రుణమాఫీ, ఎంఎస్‌పీ చట్టం వంటి హామీలు కురిపించింది. ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత జరగనుంది. మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసారి 400కు పైగా సీట్లు సాధిస్తామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇండియా కూటమి కూడా జూన్ 4న విక్టరీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరీ ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: YSRCP: వైసీపీలోకి టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్‌

Exit mobile version