NTV Telugu Site icon

Bandi Sanjay: మీ పాలనలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. సీఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులుసహా ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కావడం లేదని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. తక్షణమే వేతన సవరణ సంఘం (PRC)ను ఏర్పాటు చేసి జులై 1 నుండి ఉద్యోగులకు పెరిగిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 9న జరగబోయే కేబినెట్ సమావేశంలో పీఆర్సీ ఏర్పాటుతోపాటు 3 నెలల్లో నివేదిక తెప్పించుకుని జులై 1 నుండి కొత్త పీఆర్సీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణమాఫీ, ఫ్రీ యూరియా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, దళిత బంధు, దళితులకు మూడెకరాలు, గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్లు, చేనేత బంధు, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, సొంత జాగా ఉన్నవారికి రూ. 3 లక్షల ఆర్దిక సాయం వంటి హామీలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మీ ప్రభుత్వానికి కొద్ది నెలల గడువు మాత్రమే మిగిలి ఉంది… అయినా హమీలను అమలు చేయకపోవడం ప్రజలను దారుణంగా వంచించడమేనని బండి సంజయ్ అన్నారు.

ఈనెల 9న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిపై చర్చించి తక్షణమే అమలయ్యేలా నిర్ధిష్ట కార్యాచరణ రూపొందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయా హామీల అమలు కోసం బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ప్రజలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Read Also: Arogya Mahila: ఉమెన్స్‌డే స్పెషల్.. మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కానుక

గిర్ని తండాకు బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇవాళ మధ్యాహ్నం జనగాం జిల్లా కొడగండ్ల మండలం గిర్ని తండాకు చేరుకోనున్నారు. గిరిజన భూ పోరాట యోధుడు జాఠోత్ ఠానూ నాయక్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి.. అక్కడ మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి (తొండ)కు చేరుకుంటారు. స్థానిక నేతలను కలవనున్నారు. సాయంత్రం 6 గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటారు.