Site icon NTV Telugu

Modi Cabinet: కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ బీజేపీకి దక్కిన చోటు..

Srinivas Varma

Srinivas Varma

Modi Cabinet: ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి శ్రీనివాస్‌ వర్మకు సమాచారం వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్ వర్మ ఘన విజయం సాధించారు. ఇప్పటికే ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే.

Read Also: Modi’s swearing-in: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరుకానున్నారు

నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నారు. శ్రీనివాస్ వర్మ.. భూపతిరాజు సూర్యనారాయణ రాజు, సీత దంపతులకు ఆగస్టు 04, 1967లో జన్మించారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేశారు. 1980 విద్యార్థి నాయకుడిగా ఏఐఎస్‌ఎఎఫ్ తరపున పని చేశారు. 1991-97 బీజేపీ భీమవరం పట్టణ , పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2010-2018 మధ్య మరోసారి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2020-2023 రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2009లో నరసాపురం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో కూటమి తరపున నరసాపురం బీజేపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఖరారైంది.

1999 తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ బీజేపీకి చోటు దక్కడం ఇదే మొదటిసారి.1998 వాజ్‌పేయ్ మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా కృష్ణం రాజు, SBPBK సత్యనారాయణ రావు పని చేశారు. ఆ తర్వాత మళ్లీ ఏపీ నుంచి కేంద్ర కేబినెట్‌లోకి బీజేపీ ఎంపీ వెళ్ళడం ఇదే మొదటిసారి.కేబినెట్‌లో పురంధేశ్వరి, సీఎం రమేష్ చోటు ఆశించినట్లు సమాచారం. అనూహ్యంగా పార్టీ మూలాలు ఉన్న శ్రీనివాస్ వర్మను మోడీ ఎంపిక చేశారు.

Exit mobile version