చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్ గారిపై జరిగిన దాడి ఘటనను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. రాజధాని ఢిల్లీ నుండి రంగరాజన్ గారికి ఫోన్ చేసి ఈటల పరామర్శించారు. దాడి ఘటన వివరాలను బీజేపీ ఎంపీ అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన మీద దాడి చేసిన వారిపై లోతైన దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ హిందూ దేవాలయాల పరిరక్షణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న సీఎస్ రంగరాజన్‌పై దాడి క్షమించరానిదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రామరాజ్యం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది రాక్షసంగా వ్యవహరించడం తగదన్నారు. ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.
Also Read: Fire Accident: పాతబస్తీలో 400 బట్టల దుకాణాలు దగ్ధం.. 24 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది!
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆలయానికి వెళ్లి.. సీఎంతో రంగరాజన్‌ను ఫోన్‌లో మాట్లాడించారు. దాడి ఘటన గురించి సీఎం ప్రధానార్చకులను అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు. రంగరాజన్‌పై దాడి ఘటనలో మొత్తంగా ఆరుగురిని అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ సోమవారం తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడైన వీరరాఘవ రెడ్డిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.