NTV Telugu Site icon

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీదారు కానేకాదు.. డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం!

Brs Party

Brs Party

MP Bandi Sanjay Said BRS Will Lost Deposits in Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీదారు కానేకాదని, డిపాజిట్లు గల్లంతవ్వడం తథ్యం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించినా కేసీఆర్ కొడుకుకు అహంకారం తగ్గలేదని, ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమలో ఉంటూ మాట్లాడుతున్నాడని విమర్శించారు. శ్వేత పత్రం, స్వేద పత్రం అంటూ అక్షరాలు మార్చి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పత్రాలు రిలీజ్ చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి ఎంపీ బండి సంజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడాడుతూ… ‘బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీదారు కానేకాదు. ఎంపీ ఎన్నికలంటేనే మోదీ ఎన్నికలనే భావన ప్రజల్లో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం ఖాయం. బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యం. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించినా కేసీఆర్ కొడుకుకు అహంకారం తగ్గలేదు. ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమలో ఉంటూ మాట్లాడుతున్నాడు. శ్వేత పత్రం, స్వేద పత్రం అంటు అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు రిలీజ్ చేసుకుంటున్నారు. నేనడుగుతున్నా.. 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టిస్తే తెలంగాణలో 6.75 లక్షల కోట్ల అప్పులు ఎట్లా చేశారు?. భూములెందుకు అమ్ముకున్నడు?, జీతాలెందుకు ఇవ్వలేపోయిండు?. బహుశా కేసీఆర్ కుటుంబమే తెలంగాణను అడ్డుపెట్టుకుని 50 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుని విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నట్లున్నరు’ అని అన్నారు.

‘కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేసిందెవరు?, వైకుంఠధామాలు సహా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే. జాతీయ రహదారుల నిధులన్నీ కేంద్రానివే. చివరకు పంచాయతీలకు ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి.. సర్పంచులకు బిల్లు ఇవ్వకుండా దివాళా తీయించింది మీరు కాదా?. బస్తీ దవాఖానాలకు కేంద్రం నిధులిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా గొప్పలు చేసుకుంటూ ప్రజలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదే. కోవిడ్ టైంలో మోదీ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు 80 దేశాలకు పైగా ఉచితంగా వాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీదే. సిగ్గులేకుండా బీఆర్ఎస్ అన్నీ తామే చేసినట్లుగా చెప్పుకుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని బండి సంజయ్ విమర్శించారు.

Also Read: KTR: లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. సిద్ధంగా ఉండండి!

‘తెలంగాణ ప్రభుత్వం 6 లక్షల 75 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగి ఉంది. జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఉంది. అయినా 6 గ్యారంటీలంటూ కాంగ్రెస్ హామీలిచ్చింది. అసలు అప్పులను ఎట్లా తీరుస్తారు?, 6 గ్యారంటీల అమలుకు నిధులెక్కడి నుండి తీసుకొస్తారు?, మీ ప్రణాళిక ఏమిటి?, సంపదను ఏ విధంగా సృష్టిస్తారు?, అప్పుల ఊబిలో చిక్కుకున్న తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో ప్రజలకు వివరించాలి?. ఈ విషయంలో ప్రజల్లో అనేక సందేహాలున్నాయి?. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతే సంస్థ సమావేశాలకు ప్రభుత్వం నిధులెట్లా విడుదల చేస్తుంది?. దీనివల్ల ముస్లిం పేద సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?. ఉగ్రవాదులను తయారు చేయడంతో పాటు బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడే సంస్థ తబ్లిక్ జమాతే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేందో ప్రభుత్వం స్పష్టం చేయాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.