Site icon NTV Telugu

Kangana Ranaut: ప్రచారం ప్రారంభించిన రోజే కాంగ్రెస్‌పై విసుర్లు

Kangana

Kangana

బాలీవుడ్ నటి, మండి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్ శుక్రవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గానికి కంగనా చేరుకోగానే బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీ స్వాగతం పలికారు. ఆమెపై పూల వర్షం కురిపించారు. అనంతరం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ఆమెకు ప్రజలు, మహిళలు బ్రహ్మరథం పట్టారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తనకు బీజేపీ సీటు ప్రకటించగానే కాంగ్రెస్ నాయకులు చౌకబారు రాజకీయలు చేశారని ధ్వజమెత్తారు. తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఏ మాత్రం అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీ అయితే హిందువుల్లోని ‘శక్తి’పై, మహిళలను గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు మహిళలంటే గౌరవం లేదని కంగనా విమర్శించారు. కాంగ్రెస్ నీచమైన రాజకీయాలకు తెరలేపిందని ఆమె వ్యాఖ్యానించారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి కంగనా రనౌత్‌ను బీజేపీ ఎన్నికల బరిలోకి దించింది. ఈ క్రమంలో కంగనా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేశారు. రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. అనంతరం ఆమె ట్వీట్‌కు కంగనా ధీటుగా బదులిచ్చారు. అయితే ఆ పోస్టు తాను చేయలేదని.. తన సోషల్‌ మీడియా అకౌంట్‌ యాక్సెస్‌ కలిగిన ఎవరో చేసి ఉంటారని సుప్రియా వివరణ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: R Krishnaiah: సీఎం జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు..

ఇక కాంగ్రెస్‌ మహిళా నేత సుప్రియా శ్రీనాథేకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మహిళలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది. మార్చి 29 సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది.

ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఇక చివరి విడత జూన్ 1న జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అన్ని పార్టీలు విజయం కోసం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వికసిత్ భారత్ కోసం ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Sriranga Neethulu : సుహాస్ ‘ శ్రీరంగనీతులు ‘ ట్రైలర్ వచ్చేసింది..

 

Exit mobile version