త్వరలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తు్న్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్ అభ్యర్థులను ప్రకటించేసింది. కానీ బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దీనిపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి సింగిల్‌గా 370 సీట్లు సాధిస్తామని ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇక ఎన్డీఏ కూమిటి అయితే 400 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కమలనాథులు తీవ్ర మేథోమదనం చేస్తున్నట్లు సమాచారం. బుధవారం ఆయా రాష్ట్రాల నేతలతో అగ్ర నాయకులు చర్చించారు.
ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ నేతలతో భేటీ అయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతోనూ ఈ తరహా భేటీలు నిర్వహించారు.
తొలి జాబితా ఎప్పుడంటే..
త్వరలోనే బీజేపీ తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా వంటి ముఖ్య నాయకుల పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరితోపాటు 2019 ఎన్నికల్లో బీజేపీ గెలవని స్థానాలను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారని సమాచారం.
2019 ఎన్నికల సమయంలో విడుదల చేసిన తొలి జాబితాలోనూ మోడీ, షా పేర్లు ఉన్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసిన తర్వాతే అభ్యర్థుల జాబితా ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు.