NTV Telugu Site icon

Kolkata Doctor Murder: బెంగాల్ బంద్‌ కు కమలదళం పిలుపు.. బీజేపీ నేతపై కాల్పులు.. వీడియో వైరల్

Bengal

Bengal

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్‌లో కలకలం రేగుతోంది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులపై పోలీసులు లాఠిఛార్జి, దాడిని నిరసిస్తూ బీజేపీ బుధవారం బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సమయంలో స్థానిక బీజేపీ నాయకుడిపై దాడి జరిగింది.

READ MORE: Allu Arjun: అల్లు అర్జున్ నువ్వు హీరో కాదు కమెడియన్.. జనసేన నేత సంచలనం

ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్థానిక బీజేపీ నాయకుడు ప్రియంగు పాండే కారుపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లు చూడవచ్చు. పాండే కారుపై దుండగుడు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కారు అద్దం పగిలి బుల్లెట్ డ్రైవర్‌కు తగిలింది. ఈ దాడిలో ప్రియంగు కూడా గాయపడ్డారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి తరువాత.. బీజేపీ నాయకుడు శుభేందు మాట్లాడుతూ.. బీజేపీ నాయకుడి వాహనంపై టీఎంసీ గూండాలు కాల్పులు జరిపారని అన్నారు. వాహనం డ్రైవర్‌కు బలమైన గాయం అయినట్లు వెల్లడించారు. బంద్ విజయవంతమైందని, ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతించారన్నారు. పోలీసులు, టీఎంసీ గూండాలు కుమ్మక్కై బీజేపీ నాయకులపై దాడులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఏసీపీ సమక్షంలోనే ఇది జరిగిందన్నారు.

READ MORE:CM Chandrababu: ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా చెడ్డ పేరు.. సీఎం కీలక వ్యాఖ్యలు

కాగా.. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం కేసుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా స్పందించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. అదో భయానక ఘటన అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలన్నారు. సోదరీమణులు, కూతుళ్లు ఇలాంటి అఘాయిత్యాలకు గురికాకుండా కాపాడాలన్నారు. ఈ అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని పేర్కొన్నారు. కోల్‌కతాలో జరిగిన ఈ ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేరస్థులు మాత్రం దర్జాగా ఉన్నారన్నారు. సమాజం నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.