GVL Narasimharao: టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తులోనే ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదనను పవన్‌కల్యాణ్‌ను తీసుకువచ్చారని.. అదే విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. పవన్‌కల్యాణ్ కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నారన్నారు. పొత్తులపై తమ అధిష్టానమే అంతిమ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన మాత్రం కలిసే ఉన్నాయని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ఉండవని పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో ఫలితాలు మరొక రాష్ట్రంలో ప్రభావం చూపించవన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ సానుకూల ఫలితాలు ఖాయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి ప్రతిపక్షాలు ఎక్కువ ఆరాటపడితే భంగ పాటు తప్పదన్నారు. విశాఖ అభివృద్ధిలో 90శాతం కేంద్ర ప్రభుత్వ సహయంతోనే జరుగుతోందని ఆయన అన్నారు.
Read Also: Andhrapradesh: ప్రెగ్నెంట్లకు ఏపీ సర్కారు గుడ్‌న్యూస్.. ఆ సేవలు ఉచితం
కావలిలో బీజేపీ నాయకులపై పోలీసులు దాష్టీకం జరిపారని తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రంలోగా ఆ పోలీసులను సస్పెండ్ చెయ్యకపోతే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. డీఎస్పీ రమణారావుపై చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఈనెల 19న ఛార్జ్ షీట్ వేస్తామన్నారు.