NTV Telugu Site icon

Assembly Elections: మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలో బీజేపీదే పైచేయి.. తాజా సర్వేలో వెల్లడి..

Assembly Elections

Assembly Elections

Assembly Elections: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు జరిగి, ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఈ ఎన్నికలు వస్తుండటంతో అందరి ద‌ృష్టి వీటిపై ఉంది. బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిలో ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారనే విషయం స్పష్టంగా తేలబోతోంది.

ఇదిలా ఉంటే, ఈ ఎన్నికలకు సంబంధించి మాట్రిజ్ సర్వే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా ప్రజలు మూడ్‌ ఎలా ఉందనే వివరాలను వెల్లడించింది.

మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ:

4 రాష్ట్రాల్లో మహారాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్)ల ‘మహాయుతి’ కూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్)- శివసేన(ఉద్ధవ్)ల ‘మహా వికాస్ అఘాడీ’ కూటముల మధ్య పోరు నెలకొంది. ఈ పోరులో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మెరుగైన ఫలితాలను సాధిస్తుందని సర్వే వెల్లడించింది.

ఓట్ షేర్ ప్రకారం.. బీజేపీకి 25.8 శాతం, 18.6 శాతం కాంగ్రెస్‌కి, ఠాక్రే శివసేనకి 14.2, షిండే శివసేనకు 14.2 శాతం, రెండు ఎన్సీపీ విభాగాలకు 10 శాతం ఓట్లు రానున్నట్లు వెల్లడించింది. ఇతరులకు 12.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

సీట్ల పరంగా చూస్తే మరోసారి సింగిల్ లార్జెట్ పార్టీగా బీజేపీ అవతరించబోతోంది. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో బీజేపీకి 95-105 సీట్లు, శివసేన(షిండే)కి 19-24 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 7-12 సీట్లు వస్తాయని చెప్పింది.

ఇక ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్‌కి 42-47 సీట్లు, శివసేన ఠాక్రేకి 26-31 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్‌కి 23-28 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 11-16 సీట్లు రావచ్చని చెప్పింది.

హర్యానాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్:

హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 01న ఎన్నికలు జరగబోతున్నాయి. మూడోసారి కూడా అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మాట్రిజ్ సర్వే ప్రకారం.. ఈ రాష్ట్రంలో బీజేపీకి 37-42 సీట్లు, కాంగ్రెస్‌కి 33-38 సీట్లు, జేజేపీకి 3-8 సీట్లు, ఇతరులకు 7-12 సీట్లు వస్తాయని అంచనా. ఓట్ షేర్ చూస్తే బీజేపీకి 35.2 శాతం, కాంగ్రెస్‌కి 31.6 శాతం, జేజేపీకి 12.4 శాతం, ఇతరులకు 20.8 శాతం వస్తాయని అంచానా

జార్ఖండ్‌లో కమలమే:

జార్ఖండ్‌లో మొత్తం 82 అసెంబ్లీ సీట్లు ఉంటే, 81 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సర్వే ప్రకారం.. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతున్నట్లు అంచనా. బీజేపీకి 38-43 స్థానాలు, జేఎంఎంకి 19-24 సీట్లు, కాంగ్రెస్‌కి 7-12 సీట్లు, ఏజేఎస్‌యూపీకి 02-07 స్థానాలు వస్తాయని, ఇతరులు 03-08 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఓట్ షేర్ చూస్తే బీజేపీకి 41.2 శాతం, జేఎంఎంకి 18.2 శాతం, కాంగ్రెస్‌కి 12.2 శాతం, ఏజెఎస్‌యూపీకి 9.2 శాతం ఓట్లు వస్తాయని అంచనా.