బర్డ్ ప్లూ గోదావరి జిల్లాలను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ పేరు చెప్తేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కోళ్లకు సోకిన ఈ వైరస్.. కొన్ని రోజుల్లోనే లక్షలాది కోళ్లను బలి తీసుకుంది. ఈ కోళ్లను పరీక్షించిన భూపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్ రిపోర్ట్ సైతం.. దీనిని బర్డ్ ఫ్లూ వైరస్‌గా నిర్ధారించింది. ఈ వైరస్ కోళ్ల నుండి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటించింది. వందలాది వైద్య బృందాలతో రంగంలోకి దిగింది. అటు కోళ్లఫారాలను కట్టడి చేస్తూ.. ఇటు ఇంటింటి సర్వేలు కూడా నిర్వహిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరించకుండా నిలువరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. తూర్పుగోదావరి జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ల మృత్యువాతకు కారణం బర్డ్‌ఫ్లూ వైరస్ వల్లే అని తేలింది. వేలాదిగా కోళ్లు చనిపోతున్నట్లు భోపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబరేటరీ నిర్దారించింది. ఇతర దేశాలు, రాష్ట్రాలనుండి కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షుల వల్లే ఈ వైరస్ విస్తరించినట్టు ఏపీ పశు సంవర్ధక శాఖ కొంత మేరకు స్పష్టత ఇచ్చింది. దీంతో.. బర్డ్ ప్లూ వ్యాప్తి చెందకుండా నిలువరించడానికి జిల్లాలో ఆయా శాఖల అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా ఇతర పక్షి జాతికే కాకుండా.. వీటి గుడ్లు, మాసం తినడం ద్వారా మనుషులకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు రోజులుగా ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటించి, ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దించారు. ఎక్కడకక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, కోళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరోపక్క వీటివల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా.. అన్న దశలో కూడా జిల్లా అధికారులు సర్వే చేపట్టారు. ఈ దిశలోనే 64 వైద్య బృందాలు ఆయా ఎఫెక్ట్ గల ప్రాంతాల్లో ఇంటింటి సర్వే ను కొనసాగిస్తున్నారు. 34 ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఈ వైరస్ ను మరింత విస్తరించకుండా కట్టడి చేయడానికి అన్ని శాఖల యంత్రాంగాలు కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయి. జిల్లాలో కోళ్లు మృత్యు వాత పడిన పెరవలి మండలం కానూరు, సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామాల్లో పరిస్థితిపై అధికారులు సమీక్షించారు. సంబంధిత వైరస్ వివరాలు తెలుసుకున్నారు. ప్రజలను భయాందోళనకు గురి కావద్దని సూచించారు. అయితే.. కోళ్లు, వాటి గుడ్లు ద్వారా సంక్రమిస్తున్న ఈ వైరస్ వ్యాధి విషయంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజులపాటు ఆయా ప్రాంతాల్లో చికెన్ తో పాటు కోడిగుడ్లను తినడం పూర్తిగా మానేయాలని హెచ్చరించారు. బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన ఏ లక్షణాలు కనిపించినా.. వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కానూరు, మిర్తిపాడు గ్రామాల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనాను చూసిన తర్వాత బర్డ్ ప్లూ అంటే భయమేస్తుందని చెబుతున్నారు.
Modi-Trump: 5ఏళ్ళ తర్వాత మోడీ-ట్రంప్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ..
బర్డ్ ప్లూ వైరస్ ప్రబలకుండా ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గోదావరి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా హెచ్ఎన్1 -బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా గుర్తించారు. తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని కోళ్ల ఫారాల నుంచి పంపిన నమూనాలు పాజిటివ్ గుర్తించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు రెండు జిల్లాల్లోని కోళ్ల ఫారాల ప్రాంతాల్లోనే ఈ కోళ్లను పూడ్చి పెట్టారు. బర్డ్ ప్లూ తో చనిపోయిన కోళ్లతోపాటు ఆ ఫారం లో మిగిలిన కోళ్లను కూడా చంపి గోతుల్లో ఉప్పు, సున్నం వేసి పూడ్చి పెడుతున్నారు. ఈ పరిస్థితులు దృష్టించి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ వైరస్ కట్టడికి ఆయా ప్రాంతంల్లో కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. పశు వైద్య శాఖ, వైద్య శాఖ అధికారుల సూచనల మేరకు కొన్ని రోజులపాటు గుడ్లు, చికెన్ మాంసాలు తినకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా చిన్నారులకు వేసే కోడిగుడ్లు కూడా కొన్ని రోజులపాటు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో ప్రస్తుతం గత కరోనా సమయంలో ఎటువంటి ఆందోళన కనిపించిందో.. అదే తరహా ఆందోళన సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా.. బర్డ్ ఫ్లూ వైరస్ సోకి మూడు లక్షలకు పైగా కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో హై అలర్ట్ కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడకక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసారు. ప్రత్యేక జోన్లుగా విభజించి మరీ.. అధికారులు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీని నివారణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఎక్కడైనా బర్డ్ ఫ్లూ సోకిన లక్షణాలు కనిపిస్తే.. సమాచారం అందించాలని ప్రజలకు వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోళ్ల ఫారంలకు కిలోమీటరు దూరం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెడ్ జోన్‌లో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. కోళ్లకు సంక్రమిస్తున్న వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఉష్ణోగ్రతను బట్టి వైరస్ హెచ్చు తగ్గులు ఉంటాయని, ఈ వైరస్ వలస పక్షులద్వారా వేగంగా వ్యాప్తి చెందిందని పశు సంవర్థక శాఖ అధికారులు భావిస్తున్నారు. మొదట్లో చనిపోయిన వీటిని పూడ్చి పెట్టకుండా బయట పడేయడంతో.. వైరస్ మరింత వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే బర్డ్ ఫ్లూ వైరస్ జీవించలేదని చెబుతున్నారు. ప్రస్తుతం అధిక శాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే నమోదవుతున్నందున వైరస్ వ్యాప్తి చెందలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో పక్క చనిపోయిన కోళ్లకు పరిహారం అందించనున్నట్లు అధికారులు భరోసా ఇస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కోడి ధర 300 రూపాయలు ఉండగా ప్రభుత్వం కోడికి వంద రూపాయలు పరిహారం అందించే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అటు పెరవలి, ఇటు సీతానగరం మండలాల్లో ఆయా కోళ్ల ఫారాల చుట్టూ కిలోమీటరు పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ మాత్రమే చికెన్ దుకాణాలు మూసివేశారు. వైరస్ వ్యాపించిన 10 కిలోమీటర్ల పరిధి లోనూ నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నారు. కోడి మాంసంతో పాటు గుడ్ల వాడకాన్ని కొన్ని రోజులపాటు అన్ని ప్రాంతాల్లోనూ తగ్గిస్తే మంచిదని సూచిస్తున్నారు.