Bill Gates-AP: గన్నవరం చేరుకున్న బిల్‌గేట్స్‌.. ఏపీ నేతలతో కీలక భేటీ!

  • గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న బిల్‌గేట్స్‌
  • బిల్‌గేట్స్‌కు ఘన స్వాగతం పలికిన నారా లోకేష్
  • ఎయిర్‌పోర్ట్‌ నుంచి సచివాలయం బయల్దేరిన బిల్‌గేట్స్‌
Bill Gates Ap

Bill Gates Ap

గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్‌కు ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ సమస్య ఎదురైంది. పొగమంచు కారణంగా ల్యాండింగ్‌కు అంతరాయం కలిగింది. దీంతో ఫ్లైట్‌ కాసేపు విజయవాడ చుట్టూ గాల్లో చక్కర్లు కొట్టింది. పైలట్‌కు రన్‌వే సరిగా కనిపించకపోవడంతో విమానాన్ని దింపడం సాధ్యపడలేదు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డాక ఫ్లైట్‌ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైంది.

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న గేట్స్‌కు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అధికారుల బృందం కూడా ఆతిథ్యం అందించింది. అనంతరం గేట్స్‌ బృందం గన్నవరం నుంచి రాష్ట్ర సచివాలయానికి బయలుదేరింది. ఈరోజు ఉదయం 9:30 గంటలకు గేట్స్‌ సచివాలయానికి చేరుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌ (RTGS) సాంకేతికత, వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం, డేటా ఆధారిత పాలన వంటి అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన చర్చించనున్నారు.

Also Read: Nuclear Fusion Reactor: న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను నిర్మించిన 12 ఏళ్ల బాలుడు.. ఆశ్చర్యపోయిన సైంటిస్టులు

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన “స్వర్ణాంధ్ర విజన్”పై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని గేట్స్‌కు వివరించనున్నారు. ఈ భేటీ ద్వారా రాష్ట్రానికి గేట్స్ ఫౌండేషన్ సహకారం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. సచివాలయ సమావేశాల అనంతరం సీఎం నివాసంలో గేట్స్‌ బృందానికి విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత గేట్స్‌ ఢిల్లీకి బయలుదేరనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.