బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురు పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్టానం మరి కాసేపట్లో అధికారికంగా నోట్ విడుదల చేయనుంది. కవిత గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడమే ఈ వేటుకు కారణమైంది. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన కవితపై ప్రస్తుతం గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారు.
గత కొంతకాలంగా బీఆర్ఎస్, ఆ పార్టీ నేతకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ కలవబోతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కవిత మొదట తండ్రికి లేఖ రాశారు. పార్టీ నేతలను ఉద్దేశించి.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కవిత.. సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న కవితపై అధిష్టానం చర్యలు తీసుకుంది.
Also Read: Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట!
కవిత ఎపిసోడ్‌లో కీలక అంశాలు:
# ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ తర్వాత మొదట తండ్రికి లేఖ రాసిన కవిత
# మే 22న కవిత అమెరికా పర్యటనలో ఉండగా బయటకు వచ్చిన లేఖ
# మే 23న అమెరికా నుంచి వచ్చిన కవిత, అదే రోజు పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు
# మే 25న చిట్ చాట్‌లో కేటీఆర్, హరీష్ రావుపై పరోక్షంగా విమర్శలు
# ఆగస్టు 3న పార్టీ సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు, జగదీష్ రెడ్డి వైపే ఉన్న పార్టీ అధిష్టానం
# సెప్టెంబర్ 1 అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కవిత, అదే రోజు పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత
# సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ సంచలన నిర్ణయం, పార్టీ నుంచి కవిత బహిష్కరణ
