2026 సంక్రాంతి శోభతో గోదావరి జిల్లాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లె వాతావరణంలో రంగు ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాటాల మధ్య భోగి వేడుకలు సంబరాన్ని తాకుతున్నాయి. పండుగ వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను గోదావరి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
విజయవాడలో భోగి పండుగ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక పల్లె వాతావరణాన్ని తలపించేలా భోగి పండుగ జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలూ, కులమత తారతమ్యాలు లేకుండా ఒకేచోట గత సంవత్సరంలో అనుభవించిన కష్ట నష్టాలను భోగిమంటల్లో వేసేసి, కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో వర్ధిల్లేలా చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి మంటలు కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యలర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ కార్యకర్తలను ఉత్సాహపర్చారు. మధ్యమద్యలో అంబటి ఉత్సాహంగా స్టెప్పులేశారు.
మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తండ్రితో కలిసి హీరో మంచు విష్ణు భోగి మంటలు వేశారు. సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగల విశిష్టతను మోహన్ బాబు వివరించారు. మన తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ ప్రాంగణంలో పండుగ కళ వెల్లివిరిసింది.